Will not contest election for Congress president, says Ashok Gehlot
mictv telugu

సోనియా గాంధీకి నా క్షమాపణలు.. పోటీ చేయలేను

September 29, 2022

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తేల్చి చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీలో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ .. తాను ముఖ్యమంత్రిగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవడం వల్లే గత కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడినట్లు సోనియాకు వివరించానన్నారు. దీనిపై ఆమెకు క్షమాపణ చెప్పానని గెహ్లాట్ తెలిపారు.

అంతేగాక, రాహుల్ గాంధీని తాను కొచ్చిలో కలిశానని, అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ కొనసాగాలని కోరానని చెప్పారు. ఆయన అందుకు అంగీకరించకపోవడం వల్లే తాను బరిలో దిగానని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. నైతిక బాధ్యతతో బరిలో నుంచి తప్పుకుంటున్నానన్నారు. రాజస్థాన్‌లో జరిగిన పరిణామాలపై చింతిస్తున్నానని చెప్పారు

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అన్న ప్రశ్నకు స్పందించిన గెహ్లాట్.. ఈ విషయాన్ని తాను నిర్ణయించనని, అంతా సోనియా గాంధీ చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. రాజస్థాన్ సీఎల్పీ భేటీలో ఎలాంటి తీర్మానం ఆమోదం పొందకపోవడంపై విచారం వ్యక్తం చేశారు గెహ్లాట్.