సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య, బాలీవుడ్ మాఫియా, నెపోటిజం, డ్రగ్స్ మాఫియా, మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈసారి రైతులను టార్గెట్ చేసింది. రైతులు ఉగ్రవాదులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కంగనాపై పోలీస్ కేసు నమోదైంది. కంగనా అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ రైతన్నలను అవమానించారని.. ఆమె మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టు న్యాయవాది, తుమకూరు నివాసి ఎల్ రమేష్ నాయక్ సెప్టెంబర్ 22న కర్ణాటక డీజీపీ, తుమకూరు జిల్లా ఎస్పీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
కేంద్రం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానాలో రైతులు రోడ్లు ఎక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతన్నలు ఆందోళనలు చేస్తున్న సమయంలో కంగనా రైతులను ఉగ్రవాదులతో పోల్చడం తీవ్ర కలకలం రేపింది. పోయి పోయి రైతులపై కూడా నీ వ్యర్థ కామెంట్లా అని నెటిజన్లు కంగనా మీద విరుచుకుపడుతున్నారు. ‘రైతులు నీకు ఉగ్రవాదులుగా కనిపిస్తున్నారా ? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా ? లేక చిత్రాన్నం తింటున్నావా ? నువ్వు తింటున్న అన్నం ఎక్కడినుంచి వస్తుందో ఒక్కసారి బాగా ఆలోచించి మాట్లాడు’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఆమె మీద పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పోలీసు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుకే తాను తుమకూరు జేఎంఎఫ్సీ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశానని న్యాయవాది రమేష్ నాయక్ మీడియాకు తెలిపారు.