నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సవాల్

March 8, 2022

ja

‘గతంలో మేము గవర్నర్‌ను అవమానించినట్లు మీరు నిరూపిస్తే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేస్తా’ అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగం చేస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు గవర్నర్ గో బ్యాక్ అంటూ వ్యతిరేక నినాదాలు చేశారు. అంతేకాకుండా ప్రసంగం ప్రతులను చించేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ సభ్యుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

”రాజ్యాంగ హోదాలో ఉన్న గవర్నర్‌ను అవమానిస్తారా? ఇదేం పద్ధతి. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వకుండా కాగితాలు చించేసి ఆయనపై విసరడం ఏంటి?” అని జగన్ టీడీపీ సభ్యులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బీఏసీ సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ, సమావేశానికి హాజరైన టీడీపీ పక్షఉప నేత అచ్చెన్నాయుడును ప్రశ్నించారు. ‘చరిత్రలో ఎప్పుడూ ఇలాంటివి లేవు. మీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రతను నాశనం చేసేలా ఉంది’ అని అన్నారు. ‘గతంలో మీరూ చేశారు’ కదా అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించగా… ‘నేను చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. మంత్రిమండలిని రద్దు చేసుకుంటా’ అని సీఎం తీవ్రంగా ప్రతిస్పందించినట్లు తెలిసింది. ‘గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడమనేది ఇదే మొదటిసారి కాదు కదా’ అని అచ్చెన్నాయుడు అనగా… ‘మేమెప్పుడూ ఇలా చేయలేదు? చేశానని చూపిస్తే రాజీనామా చేస్తా’ అని సీఎం పునరుద్ఘాటించారు.