ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు ప్రకటించిన సెలవులు పెరిగే అవకాశాలున్నాయి. గతంలో సంక్రాంతి సెలవులు కంటే ప్రస్తుతం తక్కువ ఇవ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో 10 రోజులు పాటు ఉండే సెలవులు గత 2-3 సంవత్సరాల 5-6 రోజులకు కుదించారు. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తిరిగి 17న స్కూల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు రెండు రోజులు సెలవులు పెంచాలని కోరారు. మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. ఇక త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది భోగి, సంక్రాంతి సెలవులు రెండో శనివారం, ఆదివారం వచ్చాయి.