ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాకిస్థాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్ వినూత్నమైన శపథ చేశారు. 24 గంటల్లో 10 కిలోల గోధుమ పిండి బస్తా ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే తన బట్టలను విక్రయించైనా సరే.. ప్రజలకు తక్కువ ధరలో గోధుమ పిండిని అందుబాటులోకి తీసుకువస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం థకరా స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ మేరకు ఫక్తున్ఖ్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్‌కి తన నిర్ణయాన్ని తెలిపారు.
షరీఫ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక.. పాక్‌లో గతంలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణంతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతోపాటు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఈ తరుణంలో ధరలను అదుపు చేయడంలో స్థానిక ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖైబర్ పక్తుంఖ్వా ముఖ్యమంత్రి మహమ్మూద్ ఖాన్ (ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన)పై విరుచుకుపడ్డ ఆయన.. దేశంలో ధరల పెరుగుదలకు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని మునుపటి ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. 50లక్షల ఇళ్లు, కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి విఫలమైన ఇమ్రాన్ ప్రభుత్వం.. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసిందని ఆరోపించారు. తన జీవితాన్ని అర్పించైనా సరే, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని ప్రధాని ప్రకటించారు.