అమరావతి నుంచి తరలిస్తే అన్నం తినను.. మాజీ మంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

అమరావతి నుంచి తరలిస్తే అన్నం తినను.. మాజీ మంత్రి

August 21, 2019

amaravati says ex minister pullaram

ఆంధ్రుల ప్రజా రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నారన్న వార్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతికి కృష్ణా నది వరదల నుంచి ముంపు పొంచి ఉందన్న విషయం తాజా వరదలతో వెల్లడైందని  మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. 

చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం రాజధాని తరలింపు దిశగా అడుగులు వేస్తే ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వానికి ముక్కుతాడు వేయాలని ఆయన కోరారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కమిటీలను వేసి విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ తప్పుకొంది. అలాగే ఏఐఐబీ కూడా అమరావతికి సహకారం ఇచ్చే ప్రతిపాదనను విరమించుకుంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.