మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా?: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందా?: జగన్

April 7, 2022

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో వలంటీర్లకు గురువారం వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన అత్యుత్తమ సేవలను అందించినవారికి ప్రోత్సాహంగా వలంటీర్లను సన్మానించారు. అవార్డుతోపాటు నగదు బహుమతిని అందించారు. జగన్ మాట్లాడుతూ..”సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, రాష్ట్రం శ్రీలంకలా అవుతుందా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ 33 పథకాలు నేరుగా అందుతున్నాయి.

ప్రతిపక్ష పార్టీలు సంక్షేమ పథకాలు చూసి బురద జల్లుతున్నాయి. అందుకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేస్తున్నారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం. ఇచ్చిన హామీల మేరకు మంచి చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. వాళ్ల మాదిరి ప్రజలకు వెన్నుపోటు పొడిస్తే అమెరికా అవుతుందట. ఇలా మాట్లాడుతున్న వారికి మనసు ఉందా? వారికి నీతి, న్యాయం, ధర్మం అనే పదాలకు అర్థాలు తెలుసా? గతంలో దోపిడీ చేసిన వీళ్లే.. ప్రస్తుతం నిందలు వేస్తోంది వీళ్లే” అని జగన్ అన్నారు.

అంతేకాకుండా దిశ వంటి చట్టాలు, దిశ యాప్‌ల వలన ఫోన్ పట్టుకొని చెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లగలుగుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ గురించి ప్రజలకు వాలంటీర్లు వివరిస్తున్నారు. ప్రభుత్వ అందించే పథకం ప్రజలకు చేరువవుతుందన్నారు. దేశమే మన సేవల్ని అభినందిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈ రోజు నుండి మొదలవుతుందని జగన్ తెలిపారు. వాలంటీర్లు ఉద్యోగం కాదు, గొప్ప సేవ చేస్తున్నారు. సేవలకు ప్రోత్సాహంగా సన్మాన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.