మరికొన్నిగంటల్లో 2023 బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయ్యిది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మోదీ ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ను తీసుకురానుంది. ఈ బడ్జెట్‌పై యావత్ దేశ ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి, దేశీయ తయారీదారులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం దాదాపు 35 ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీని పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింటికీ మించి దిగుమతి సుంకాన్ని పెంచే జాబితాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసిందని చెబుతున్నారు విశ్లేషకులు . ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాప్టర్లు, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్, ఆభరణాలు, ప్లాస్టిక్ వస్తువులతోపాటు అనేక ఇతర వస్తువులపై సుంకాలు పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖలు టారిఫ్‌ను పెంచాల్సిన ఉత్పత్తుల జాబితాను కేంద్రం సిద్ధం చేసినట్లు సమాచారం.
దిగుమతులు మరింత ఖరీదుగా మారితే దేశీయంగా ఉత్పత్తి పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది.అయితే డిసెంబర్ నెలలో, వాణిజ్య మంత్రిత్వ శాఖ దిగుమతి సుంకాన్ని పెంచగల ఉత్పత్తుల వివరాలను అందించాలని వివిధ మంత్రిత్వ శాఖలను కోరింది. అంతేకాదు, కరెంటు ఖాతా లోటు పెరిగిపోతున్న తరుణంలో దిగుమతులను తగ్గించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కరెంట్ ఖాతా లోటు తొమ్మిది నెలల గరిష్ట స్థాయి 4.4 శాతానికి పెరిగింది. ఇది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైంది. అంతేకాకుండా, దేశ జిడిపి వృద్ధి మందగించవచ్చని IMF అంచనా వేసింది. 2023-24లో వృద్ధి రేటు 6.1 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మాంద్యం వస్తుందని IMF పేర్కొంది. .కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. మరి కేంద్రం ఎలాంటి వరం ఇస్తుందో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది.