నాన్న విషయంలో అబద్ధం చెప్తావా.. నోయెల్‌పై ట్రోలింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

నాన్న విషయంలో అబద్ధం చెప్తావా.. నోయెల్‌పై ట్రోలింగ్

October 18, 2020

Will you lie about your father .. Trolling on Bigg boss season 4 contestant Noel.jp

ఉన్నట్టుండి బిగ్‌బాస్ రియాలిటీ షోలో పాల్గొంటున్న నోయెల్ మీద సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అబద్ధాల కోరు’ అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ‘ఇన్ని రోజులు నువ్వు మంచి ఆటగాడివి అనుకున్నాం. కానీ నువ్వు తల్లిదండ్రుల గురించి అబద్ధం చెబుతావా?’ అంటూ చెడుగుడు ఆడుకుంటున్నారు. ‘సింపతీతో ప్రేక్షకులను ఎమోషనల్ ఫూల్స్ చేసి నువ్వు గెలుద్దాం అనుకుంటున్నావేమో. నీ అసలు రంగు ఏంటో నీ వికీపీడియానే చెబుతోంది’ అంటూ నోయెల్ వికీపీడియా స్క్రీన్ షాట్లు తీసి పంచుకుంటున్నారు. ఇంతకీ బిగ్‌బాస్ ఇంట్లో ఉంటున్న నోయెల్ ఏం చేశాడు? ఈవారం మధ్యలో కంటెస్టెంట్లు రియ‌ల్ లైఫ్ క‌ష్టాలు చెప్పుకుని కన్నీరు మున్నీరు అయిన విషయం తెలిసిందే. వారిలో చాలామంది కంటెస్టెంట్లు మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం నుంచే వ‌చ్చామని చెప్పి ఏడిచారు. 

 

నోయెల్ కూడా త‌న కుటుంబం గురించి చెప్తూ.. మా అమ్మ అంద‌రి ఇళ్ల‌ల్లో ప‌ని చేసేదని.. నాన్న ర‌క‌ర‌కాల ప‌నులు చేసేవాడని చెప్పాడు. ఇస్త్రీ, మేస్త్రీ ప‌ని చేస్తూ డ‌బ్బులు సంపాదించేవాడు అని తెలిపాడు. అదంతా విని ఇంట్లో సభ్యులు అయ్యోపాపం అన్నారు. కానీ, బయట జనాలు ఊరుకోరుగా. ఎగురుతున్న పక్షి రెక్కలను లెక్కించి చెప్పే రకాలు చాలా ఉన్నాయి. వెంటనే నోయెల్ వికీపీడియాలోకి తొంగిచూశారు. అందులో నోయెల్  తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగి అని ఉంది. దానిని పట్టుకుని నెటిజన్లు నోయెల్ మీద ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘ప్రేక్ష‌కుల‌ను బ‌క‌రా చేసిన నోయ‌ల్ మోసం బ‌య‌ట‌ప‌డింది. తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అయినా కూడా రోజువారీ కూలీ అన్న‌ట్లుగా చెప్పి సింప‌తీ ఓట్లు పొందాల‌ని చూస్తున్నాడు’ అని విరుచుకుపడుతున్నారు. మరోపక్క వికీపీడియాలో ఓసారి అత‌డి తండ్రి డిఫెన్స్ ఉద్యోగి అని, మ‌రోసారి కూలీ అని మార్చేసి ఉన్న ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. 

అయితే నోయెల్ అభిమానులు మాత్రం అతడిని వెనకేసుకు వస్తున్నారు. ‘నోయెల్ తండ్రి అంత‌కు ముందు డెయిలీ లేబ‌ర్ కావ‌చ్చు. త‌ర్వాత ఆ ఉద్యోగంలో చేరాడేమో’ అని చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందైనా నాగర్జున అన్నట్టు నోయెల్ తన ముసుగు తొలగించుకుని రియల్ ఆట ఆడతాడేమో. కాగా, ఈవారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్న నోయెల్ సహా లాస్య, హారిక, అమ్మా రాజశేఖర్‌లు సేవ్ అయ్యారు. అరియానా, మోనాల్ గజ్జర్, అఖిల్, అభిజిత్, దివి, కుమార్ సాయిలో ఎవరు ఈరోజు ఇంటినుంచి బయటకుపోతారో ఆసక్తిగా మారింది. ప్రోమోలో ఈవారం ఇద్దరు ఎలిమినేట్ అవుతారని చూపించారు.