మన సెక్స్ వీడియోను పోస్ట్ చేస్తా.. పాల్పంచ లేడీ బ్లాక్‌మెయిల్ - MicTv.in - Telugu News
mictv telugu

మన సెక్స్ వీడియోను పోస్ట్ చేస్తా.. పాల్పంచ లేడీ బ్లాక్‌మెయిల్

September 21, 2020

నచ్చిన అమ్మాయి, అబ్బాయితో సన్నిహితంగా తిరగుతూ కోరికలు తీర్చుకుంటున్నారు. పైగా అందుకు సంబంధించిన వీడియోలను ఒకరికి తెలియకుండా ఒకరు రహస్యంగా తీసుకోవడం, తర్వాత వాటిని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం.. ఈమధ్య తరచుగా జరుగుతున్న సంఘటనలు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉంటున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అలాంటిదే ఓ ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని టీచర్స్‌కు కాలనీకి చెందిన ఓ మహిళ ధనవంతులతో పరిచయాలు పెంచుకుంది. అదే అదనుగా వారితో శృంగారంలో పాల్గొని.. అదంతా రహస్యంగా వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోంది. ఇలా పలువురి నుంచి భారీగా నగదు డిమాండ్‌ చేసింది. ఇటీవల శాస్త్రి రోడ్‌కు చెందిన ఓ బడా వ్యాపారిని ఇదే తరహాలో ట్రాప్ చేసింది సదరు లేడీ. అతన్ని లొంగదీసుకుని, డబ్బులు డిమాండ్ చేసింది. అంత డబ్బు తాను ఇచ్చుకోలేనని బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ కిలేడీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 

శాస్త్రినగర్ వ్యాపారికి ఓ రోజు మహిళ ఫోన్ చేసింది. తాము శృంగారంలో పాల్గొన్న సెక్స్ టేప్ వీడియో తన వద్ద ఉందని చెప్పింది. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించింది. ఈ వ్యవహారంలో పాల్వంచ, ఇల్లెందు పట్టణాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం రాయబారం నడిపారు. సదరు వ్యాపారి అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పాడు. దీంతో ఆ యువతి పలుమార్లు ఫోన్లు చేస్తూ మరింత వేధించసాగింది. ఈ క్రమంలో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని సినీఫక్కీలో పట్టుకున్నారు. తొలుత ఆ వ్యాపారితో డబ్బులు కొంత మొత్తం ఇస్తామని పోలీసులు చెప్పించారు. దీంతో సదరు మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు అతను చెప్పిన చోటుకి రాగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులోని డేటా, వీడియోలు, ఫోటోలు పరిశీలించగా.. మరికొందరు కూడా ఆమె ట్రాప్‌లో చిక్కుకున్నారని గుర్తించారు. ఆ మహిళ వలలో కేటీపీఎస్‌ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది ఉన్నారు.. ఏ స్థాయిలో డబ్బులు కాజేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు ఓ అంగన్‌‌వాడీ సెంటర్‌కు చెందిన మహిళ సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.