మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం దిశగా సాగుతున్న సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సాయంత్రం ప్రజలనుద్దేశించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడారు. తాను సొంత మనుషులు అనుకున్నవాళ్లు ఇప్పుడు తనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ఏక్నాథ్ షిండే సహా ఎవరైనా నన్ను సీఎంగా వద్దు అని చెబితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని తెలిపారు. రాజీనామా లేఖ కూడా సిద్ధంగా ఉందని ఆయ తెలిపారు. అధికారిక నివాసాన్ని వదిలివేస్తానని స్పష్టం చేశారు.
సీఎంగా తాను అసమర్ధుడని పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా.. అది తనకు అవమానమేనని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా దిగిపోవాలంటే రాజీనామా చేస్తానని.. శివసేన నుంచి వేరే ఎవరినైనా సీఎం చేయవచ్చు అని అన్నారు. అనుకోకుండా నాకు సీఎం పదవి దక్కిందని, సీఎం పదవి తీసుకోవాలని గతంలో శరద్ పవార్ నన్ను కోరారని గుర్తు చేశారు. పవార్ కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, సీఎం పదవి కోసం పోరాటం చేయనని చెప్పారు. సీఎంగా నా బాధ్యతలు నిర్వర్తించానని, అధికారంలో ఉన్నప్పుడు తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని చెప్పారు. అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటామని అన్నారు.
బాలా సాహేబ్కు తామే అసలైన వారసులమని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. శివసేన హిందుత్వానికి ఎప్పుడూ దూరం కాలేదని చెప్పారు. శివసేన హిందూమతం కలిసే ఉంటాయన్నారు. తాము గత 30 ఏళ్లుగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించామని, కానీ, ఇప్పుడు ఆ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలున్నాయన్నారు. ఇప్పుడున్నది సరికొత్త శిసేన అని అన్నారు.