Wine shops taking photos of buyers in Andhra Pradesh Nellore atmakur
mictv telugu

మందుబాబులకు కొత్త చిక్కు.. ఫొటో తీసి బుక్ చేస్తున్నారు..

February 7, 2023

ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబుల కష్టాలు ఇన్నీ అన్నీ కావు. ప్రపంచంలో మరెక్కడా లేని వింతవింత బ్రాండ్లు అక్కడ హల్ చల్ చేస్తుంటాయి. మూడు సీసాలకు మించి కొనడం గగనం. మందు కొట్లతో డిజిటల్ చెల్లింపులకు చాన్సు లేదు. అంతా క్యాషే. తాజాగా విజయవాడలోని కొన్నిషాపుల్లో డిజిటల్ చెల్లింపులకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. ఇలా చెబుతూపోతే చిత్రగుప్తుడి చిట్టాలా ఎన్నో సమస్యలు. తాజాగా వీటికంటే దారుణమైన కష్టం వచ్చిపడింది.

మేమేమి చేశాము నేరం..
మూడుకు మించి మందుసీసాలను కొనే వారిని వైన్ షాపుల సిబ్బంది ఫోటోలు తీస్తున్నారు. రికార్డు కోసం ఇలా తీసి సంబంధింత సర్కారీ సిబ్బందికి ఫార్వార్డ్ చేస్తున్నారు. తర్వాత జరగాల్సింది జరిగిపోతోంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుతోపాటు పలుచోట్ల ఫోటోలు తీస్తున్నారని మందుబాబులు వాపోతున్నారు. ‘మందేగా కొనుక్కుంటున్నాం, విషమో, దొంగసొత్తో కొనుక్కుంటున్నట్లు మా ఫోటోలు ఎందుకు తీస్తున్నారు?’’ అని ప్రశ్నిస్తుంటే అంగడివాళ్లు జవాబు ఇవ్వకుండా నవ్వుతున్నారని మండిపడుతున్నారు. కొన్నిచోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి.

ఎందుకు..
ఒక షాపులో మూడు సీసాలు కొన్న వ్యక్తి మరో షాపుకు వస్తే గుర్తుపట్టడానికి ఇలా ఫోటోలు తీస్తున్నారని చెబుతున్నారు. మూడు సీసాలకు మించి కొనకూడదని నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఐదారు షాపుల్లో ఇలా మూడేసి సీసాల చొప్పు భారీ సంఖ్యలో కొనుక్కుని ఇళ్ల దగ్గర ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, దీన్ని అరికట్టడానికే ఫోటోలు తీస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మందుబాబుల ఫొటోలు తీసి గ్రామ వలంటీర్ల గ్రూపుల్లో పెడుతున్నారని, పోలీసులు చర్యలు తీసుకోవడానికి వీలుగా ఈ ఫోటోల తతంగం నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం దీనిపై ఇంతవరకు స్పందించలేదు. దశలవారీగా మద్యనిషేధం పేరుతో ప్రభుత్వం సీసాల కొనుగోలుపై పరిమితి, బెల్టు షాపుల రద్దు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల్లో తనిఖీ వంటి నానా చర్యలూ చేపడుతుండడం తెలిసిందే. అయితే వీటివల్ల లాభం లేకపోగా కల్తీ సరుకు, అక్రమ అమ్మకాలు పెచ్చరిల్లాయనే విమర్శలు ఉన్నాయి.