ఇళ్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో 9 శాతం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఇళ్ల ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో 9 శాతం..

May 25, 2022

 

దేశవ్యాప్తంగా ఇళ్ల, ప్లాట్ల ధరలు తీవ్రంగా మండిపోతున్నాయి. సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు సొంతింటి కళను నిజం చేసుకోవడానికి ఇళ్ల, ప్లాట్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో క్రెడాయ్, కాలియర్స్, లియాసెస్ ఫోరాస్ సంయుక్తంగా సర్వే చేపట్టాయి. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి. ఆ నివేదిక ప్రకారం..”దేశ వ్యాప్తంగా ఇళ్లు, ప్లాట్లకు డిమాండ్ బాగా పెరిగింది. 2021 జనవరి, మార్చితో పోలిస్తే ఈ ఏడాది ఇళ్ల ధరలు గరిష్టంగా 11 శాతం పెరిగాయి. ఢిల్లీలో 11 శాతం పెరిగి చదరపు అడుగు ధర రూ.7,963కు చేరింది. ఇక, హైదరాబాద్‌లో 9 శాతం వరకు పెరిగింది. చ.అ. రూ.9,232 వరకు పలుకుతోంది. అహ్మదాబాద్‌లో 8 శాతం పెరిగి, రూ. 5,721కు చేరింది. కోల్‌కతాలో 6 శాతం పెరిగి రూ. 6,245కు, పుణెలో 3 శాతం పెరిగి రూ. 7,485కు పలుకుతోంది” అని వెల్లడించింది.

అనంతరం కాలియర్స్ ఇండియా సీఈఓ రమేశ్ నాయర్ మాట్లాడుతూ..”మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, బెంగళూరు, చెన్నై, ముంబైలలో చదరపు అడుగు ధర 1 శాతం పెరిగింది. దాంతో రూ. 7.505, రూ.7,107, రూ.19,557గా పలుకుతోంది. దేశం మొత్తం నివాసాల ధరలు సగటున 4 శాతం పెరిగాయి. మరికొద్ది రోజుల్లో నిర్మాణ వ్యయాల వల్ల వచ్చే 6-9 నెలల్లో ఇళ్ల ధరలు మరో 5-10 శాతం పెరగొచ్చు. 2022 జనవరి, మార్చిలో కొత్త ప్రాజెక్టులు కరోనా కారణంగా డౌన్ అయ్యాయి. రాబోయే మరో మూడు నెలల్లో మరిన్ని పెరగొచ్చు. ఇటీవలి కాలంలో వడ్డీ రేట్లు పెరిగాయి. అయినా కూడా విక్రయాలు కొనసాగొచ్చు. ఉక్కు ఉత్పత్తుల ధరలు తగ్గి, నిర్మాణ ప్రాజెక్టుల వ్యయాలు అదుపులోకి రావచ్చు” అని ఆయన అన్నారు.