పామాయిల్‌కు రెక్కలు.. ఏకంగా రూ. 225! - MicTv.in - Telugu News
mictv telugu

పామాయిల్‌కు రెక్కలు.. ఏకంగా రూ. 225!

April 25, 2022

ఇండోనేషియా భారతదేశానికి బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకొంటున్నా పామాయిల్‌పై నిషేధం విధించింది. దీంతో సామాన్యుడిపై పెను భారం పడనుంది. ఇప్పటికే మార్కెట్లో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పామాయిల్‌ లీటర్ ప్యాకెట్ ధర భారీగా పెరగనుంది.

భారతదేశం ప్రతీ ఏడాది సగటున 13 మిలియన్‌ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకొంటున్నది. ఇందులో పామాయిల్‌ వాటా 8.5 మిలియన్‌ టన్నులు. భారతదేశ పామాయిల్‌ అవసరాల్లో సగం అంటే నాలుగు మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను ఇండోనేషియా నుంచే దిగుమతి చేసుకొంటుంది. ఇండోనేషియా నిషేధం కారణంగా మే నెల నుంచి ఈ దిగుమతులు ఆగిపోనున్నాయి.

మరోపక్క రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇండియాకు పొద్దు తిరుగుడు నూనె దిగుమతులు సగానికి పడిపోయాయి. ఫలితంగా పామాయిల్‌కు ఇప్పటికే డిమాండ్‌ పెరిగింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందుతో పోలిస్తే పామాయిల్‌ ధర 50% కంటే ఎక్కువగా పెరిగింది. ప్రస్తుతం లీటరుకు రూ. 175 ఉండగా, ఇది రూ.225కు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పామాయిల్‌ను కేవలం ఆహార ఉత్పత్తుల్లోనే కాకుండా కాస్మెటిక్స్‌, బయో ఇంధనాల తయారీలోనూ వాడతారు. వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.