గోధుమ, వంటనూనెలకు రెక్కలు - MicTv.in - Telugu News
mictv telugu

గోధుమ, వంటనూనెలకు రెక్కలు

April 9, 2022

01

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు, చమురు ధరలు, మాంసము ధరలు, సబ్బుల ధరలు, వంటనూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్య ప్రజలు ఏం కొనలేక ఆర్థిక ఇబ్బందులతో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వ్యాపార యాజమాన్యాలు కరోనా కారణంగా, రెండేళ్లపాటు తమ వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగడంతో, నష్టాల బాట పట్టాయని, దీనికితోడు యుద్ధం కారణంగా వస్తువులు రేట్లను పెంచుతున్నట్లు ఆయా సంస్థలు ఇటీవలే పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ.. ఎస్ఎమ్ ఆహార ధరల సూచి ఫిబ్రవరితో పోలిస్తే, మార్చిలో 12.9 శాతం పెరిగింది. 1990లో ప్రారంభమైన ఈ సూచి ఇంతగా ఎన్నడూ పెరగలేదు. ప్రపంచ గోధుమ, మొక్కజొన్న ఎగుమతులలో రష్యా, ఉక్రెయిన్ వాటా వరుసగా 30, 20 శాతాలుగా ఉంది. అయితే, ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎగుమతులు నిలిచిపోయి ఆహార ధాన్యాల ధరలు 17.1 శాతం పెరిగాయని ఎస్ఏడీ తెలిపింది. దీంతో పొద్దు తిరుగుడు నూనెతో సహా, వంటనూనెల ధరలు 28.2 శాతం పెరిగాయని పేర్కొంది.

అంతేకాకుండా పొద్దు తిరుగుడు నూనె ఎగుమతుల్లో ఉక్రెయిన్, రష్యాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. యుద్ధం, ఆంక్షలు, నల్ల సముద్రం, బాల్టిక్ సముద్రాల నుంచి నౌకల రాకపోకలు నిలిచిపోవడం వల్ల గోధుమ, వంటనూనెల ఎగుమతులు దెబ్బతిని ప్రపంచమంతటా ధరలు పెరిగిపోతున్నాయి. అమెరికా, చైనాల్లో అనావృష్టి ఆహారోత్పత్తిని దెబ్బతీసినందున రష్యన్, ఉక్రెయిన్ ఎగుమతుల లోటును భర్తీ చేయడం వీలుపడటం లేదు. అదీకాకుండా ఎరువులు, ఇంధన ధరలు పెరిగి, కొవిడ్ వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై పంట దిగుబడులు తగ్గిపోయాయి.

మరోపక్క ఆఫ్రికా మధ్య, పశ్చిమ భాగాల్లోని సాహెల్ ప్రాంతం, నైజీరియాలో 60 లక్షల మంది పోషకాహార లోపం బారిన పడ్డారు. అక్కడి పట్టణాల్లో 1.6 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత కొరవడుతోంది. సాహెల్, నైజీరియాలలో 2.2 కోట్ల మందికి ఆరు నెలలపాటు ఆహారం అందించడానికి 77.7 కోట్ల డాలర్ల నిధులు కావాలని ఐక్యరాజ్యసమితి ఆహార కార్యక్రమ సంస్థ ప్రపంచ దేశాలను కోరింది. నిరుపేద దేశాలకు ఆహార దిగుమతుల వ్యయాన్ని తగ్గించడానికి ఎస్ఎక్స్ ప్రయత్నాలు మొదలు పెట్టింది.