నల్లొండలో చేతబడి! రూ.10 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

నల్లొండలో చేతబడి! రూ.10 లక్షల జరిమానా

May 3, 2022

 

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అమావాస్య రోజున కొందరు చేతబడి చేసి, గ్రామానికి చెందిన ఓ మహిళను చంపారంటూ పెద్ద మనుషులు వారికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించిన సంఘటన కలకలం రేపింది.

దేవరకొండ మండలం వైదోని వంపు గ్రామంలో గత నెల 1వ తేదీన (అమావాస్య) గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి ‘ఆమె అనారోగ్యంతో చనిపోలేదు. ఎవరో చేతబడి చేయడంతోనే చనిపోయింది’ అని అన్నాడు. దాంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి మృతురాలికి చేతబడి చేసి, చంపారంటూ మృతురాలి సంబంధీకులు ఓ మహిళతోపాటు ఇద్దరు వ్యక్తులను చితకబాదారు.

దెబ్బలు తట్టుకోలేక వారు చేతబడి చేశామని ఒప్పుకున్నారు. అనంతరం అంజయ్య అనే వ్యక్తి, అతని కోడలు కలిసి చేతబడి చేశారని వారినీ గొడవలోకి లాగారు. ఈ ఘటనపై గతనెల 29న గ్రామానికి చెందిన పెద్దలు పంచాయితీ పెట్టి, నలుగురికి రూ.10 లక్షల చొప్పున జరిమానా విధించారు. అందులో ఓ ఇద్దరు జరిమానా చెల్లిస్తామని ఒప్పుకోగా, చేయని తప్పుకు తనను నిందించారనే మనస్తాపంతో అంజయ్య గత శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి.