గుండె చెమర్చేలా.. మొబైల్ స్టోర్‌లో చిన్నారి హోం‌వర్క్ - MicTv.in - Telugu News
mictv telugu

గుండె చెమర్చేలా.. మొబైల్ స్టోర్‌లో చిన్నారి హోం‌వర్క్

November 19, 2019

హోంవర్క్ చేసుకోవడానికి ఇంట్లో కంప్యూటర్, ఇంటర్‌నెట్ లేదని ఓ విద్యార్థి ఎలక్ట్రానిక్ షాపులోని ట్యాబ్లెట్‌లో హోంవర్క్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బ్రెజిల్‌లోని రెసీఫె ప్రాంతంలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఈ దృశ్యం రికార్డు చేశారు స్టోర్ నిర్వాహకులు.

 గిల్‌హెర్మ్ శాంటియాగో(10) అనే బాలుడు అబిలియో గోమ్స్ మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్నాడు. స్కూలు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. స్కూల్లో టీచర్లు హోంవర్క్ చేసుకురావాలని పదేపదే చెప్పారు. అతని బుర్రలో అవే ఆలోచనలు తిరుగుతున్నాయి. ఇంట్లో కంప్యూటర్, ఇంటర్‌నెట్ లేవనే బాధతో ఏం చేయ్యాలో తోచక తోవ సాగుతూ వెళ్తున్నాడు. వెళ్తూ ఓ ఎలక్ట్రానిక్ స్టోర్ ముందు కూర్చున్నాడు. చాలా సేపటివరకు అక్కడే కూర్చున్నాడు. ఆ బాలుడినే గమనిస్తున్న స్టోర్ సిబ్బంది అతణ్ని లోపలికి తీసుకువెళ్లారు. ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఆరా తీశారు. చిన్నోడు చెప్పింది విని షాక్ అయ్యారు. 

హోంవర్క్ చేసేందుకు తన దగ్గర కంప్యూటర్ లేదని.. స్కూల్‌లో 278 మంది విద్యార్థులకు కేవలం 12 ట్యాబ్లెట్టు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. సిబ్బంది వెంటనే డిస్‌ప్లేలో ఉన్న శాంసంగ్ కంపెనీ టాబ్లెట్‌లో హోంవర్క్ చేసుకొమ్మని అతని చేతికి ఇచ్చారు. ఆ బాలుడు టకటకా తన హోంవర్క్‌ను ఆ స్టోర్‌లో నిల్చునే పూర్తి చేశాడు. ఇదంతా అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. 

ఈ వీడియోను చూసి చాలామంది స్పందిస్తున్నారు. స్టోర్ సిబ్బందిని పొగుడుతూనే విద్యార్థి చదువుతున్న స్కూల్‌పై మండిపడుతున్నారు. విద్యార్థులకు సరిపడా కంప్యూటర్లు స్కూల్‌లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కంప్యూటర్ల కొరతతో విద్యార్థులు ఇలా బాధపడటం అస్సలు బాగాలేదని అన్నారు.  ఈ వీడియోను చూసిన శాంసంగ్ సంస్థ పై అధికారులు.. బాలుడికి మూడు ట్యాబ్లెట్లు, ఒక కంప్యూటర్‌తో పాటు స్కాలర్‌షిప్‌ను సైతం అందజేశారు. 

కాగా, ఇలాంటి ఘటనే మన హైదరాబాద్‌లో కూడా ఒకటి చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న ఓ బాలిక స్కూలు బయట గిన్నె పట్టుకుని తొంగిచూస్తున్న ఫోటో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. అధికారులు స్పందించి వెంటనే ఆ బాలికను అదే పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక చక్కగా చదువుకుంటోంది.