మీ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ లేకపోతే జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

మీ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ లేకపోతే జరిమానా

May 5, 2020

Without Aarogya Setu App Fine In Uttar Pradesh

మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా.. అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆరోగ్యసేతు యాప్ ఉందో లేదో చూసుకోండి. ఆ యాప్ లేకపోతే మీ జేబుకు చిల్లుపడినట్టే. పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్‌కు వెళ్లే వారికి ఇది తప్పనిసరి చేశారు. యాప్ లేకుండా అక్కడికి వెళ్లారంటే మాత్రం భారీ జరిమానా కట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చే వారు కచ్చితంగా ఈ యాప్ వేసుకోవాలని లేదంటే కేసులతో పాాటు జరిమానా విధిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

ప్రస్తుతం గౌతమ్ బుద్ధ నగర్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు 179 మందికి పాజిటివ్ అని తేలగా 102 మంది కోలుకున్నారు. దీంతో అక్కడ రెడ్ జోన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సేతు కచ్చితంగా వేసుకోవాలని సూచించారు. ఒకవేళ లేకపోతే కేసు నమోదు చేస్తున్నారు. ప్రజలు కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి కఠిన చర్యలు అనుసరించక తప్పదని అధికారులు అంటున్నారు. కాగా ఈ యాప్‌తో మీరు ఉన్న ప్రాంతంలో కరోనా సోకే ప్రమాదం ఎంత వరకు ఉంది. మీ దగ్గరగా ఎవరైనా కరోనా సోకినవారు ఉన్నారా..? మీకు క్వారంటైన్ అవసరమో లేదో ఈ యాప్ చెబుతుందని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విధానం అక్కడ సక్సెస్ అయితే… దేశంలోని అన్ని రెడ్ జోన్లలో అమలు చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.