ప్రతి మనిషికి శరీరం పరంగా కొన్ని కోరికలు ఉంటాయి. అందులో సిక్స్ ప్యాక్ ఒకటి. ప్రతి యువకుడు తన శరీరం చాలా ఫిట్‌గా ఉండాలని, ఉదయం సాయంత్రం తనకు తెలిసిన వర్కౌట్స్ చేస్తుంటాడు లేదా ఏదైనా జిమ్‌కి వెళ్లి, అక్కడ ట్రైనర్ చెప్పిన ప్రతి విధానాన్ని పాటించి, తాను ఏదైతే టార్గెట్‌గా పెట్టుకున్నాడో దానికోసం శ్రమిస్తాడు. అయినా, కొన్నిసార్లు లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చు. మళ్లీ శ్రమిస్తాడు. చివరికి అతడు అనుకున్నది సాధిస్తాడు. తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు అలాంటి విజయాన్నే సాధించాడు. ఏలాంటి జిమ్ ట్రైనింగ్ తీసుకోకుండానే, గిన్నిస్ రికార్డ్‌లో స్థానం సాధించాడు. ప్రస్తుతం అతడు సాధించిన ఘనత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
View this post on Instagram
వివరాల్లోకి వెళ్తే..పంజాబ్‌కు చెందిన కువార్ అమృత్ బీర్ సింగ్..చప్పట్లు కొడుతూ, ఒక నిమిషంలో అత్యధిక పుష్అప్లు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 19 ఏళ్ల కువార్ అమృత్‌బీర్ సింగ్ ఒక నిమిషం వ్యవధిలో చప్పట్లు కొడుతూ..45 పుష్అప్లు చేశాడు. జిమ్ సెంటర్లు అంటేనే తెలియని, అక్కడికి వెళ్లని ఈ యువకుడు పుష్అప్ల ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించి, అందర్ని ఆశ్చర్యపర్చాడు. అయితే, దీనికోసం అమృత్ బీర్ సింగ్ ఎంతో పరిశ్రమించాడు. మొదట విఫలమైనా, నిరాశ చెందకుండా రెండోసారి ప్రయత్నించాడు. ఇప్పుడు అతడి ప్రయత్నం ఫలించి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు.
కువార్ అమృత్‌బీర్ సింగ్.. గిన్నిస్ రికార్డు కోసం 2021 నవంబర్‌లో మొదటిసారి ప్రయత్నించాడు. అప్పుడు తన ప్రతిపాదన తిరస్కరణకు గురికావడంతో ఎంతో నిరాశచెందాడు. అయినా, అక్కడితో ఆగకుండా గిన్నిస్ రికార్డు కోసం రెండోసారి దరఖాస్తు చేయగా, అతడి ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో చప్పట్లు కొడుతూ, ఒక నిమిషంలో 45 పుష్అప్లు చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేవలం అతడు 21 రోజులు మాత్రమే సాధన చేశానని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియోను షేర్ చేశాడు. దాంతో వీడియో వైరల్‌గా మారింది.