తెలంగాణ ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయని తెలిపింది. సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది. కానీ, ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 6న బడ్జెట్ ఆమోదంపై తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు. మార్చి 7న ఆర్థిక మంత్రి హరీష్రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అయితే, గవర్నర్ ప్రసంగం ఉండబోదంటూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ విధానం ఇప్పుడేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలా జరిగిందని అసెంబ్లీ అధికార వర్గాలు గుర్తు చేస్తున్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సందర్భంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు నిర్వహించారు. ఇక 1970 లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన దాఖలాలను ఉదాహరణగా అధికారులు తెలిపారు.