పేదలు, దళితులకే శిక్షలు వేస్తున్నారు.. సంధ్య - MicTv.in - Telugu News
mictv telugu

పేదలు, దళితులకే శిక్షలు వేస్తున్నారు.. సంధ్య

December 7, 2019

Woman 01

నేరస్థులు పేదలు, దళితులు అయితేనే వారికి ఇటువంటి శిక్షలు విధిస్తున్నారు అని సామాజిక ఉద్యమకారిణి సంధ్య అన్నారు. ‘దిశ’ కేసు ఎన్‌కౌంటర్ ఘటనపై ఆమె స్పందించారు. ఈ ఘటనపై ఓ సామాజిక ఉద్యమకారిణిగా తాను కూడా బాధపడుతున్నానని అన్నారు. నేరస్థులు పేదలు, దళితులు అయితేనే వారికి ఇటువంటి శిక్షలు విధిస్తున్నారని వాపోయారు. 

అత్యాచారాలపై దేశంలో సున్నితత్వంతో స్పందించే గుణం లేకుండా పోతోందని అన్నారు. ‘దిశ ఘటన అత్యంత క్రూరమైనదే. నిందితులకు తగిన కఠిన శిక్ష వేయాలని నేనూ డిమాండ్ చేశాను. అయితే, ఆ నలుగురినే దోషులుగా భావించి, ఎన్‌కౌంటర్ చేయడం సరికాదు. ఇలాగైతే పోలీసులను ఎలా నమ్మాలి?’ అని సంధ్య ప్రశ్నించారు.  

అత్యాచార ఘటనల్లో ప్రజల్లో ఉన్న ఆవేశాన్ని పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ఎన్‌కౌంటర్‌లు చేస్తున్నారని తెలిపారు. దేశంలోని చాలా అత్యాచార ఘటనల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదని.. మహిళలను రక్షించే విధానం ఇది కాదని చెప్పారు. 

2017లో జరిగిన ఉన్నావో అత్యాచారం ఘటన నిందితుడు, బీజేపీ బహిష్కృత నేత కుల్‌దీప్‌ సెంగార్‌ను కూడా ఇదే విధంగా ఎన్‌కౌంటర్ చేయాలని నేను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను కోరుతున్నాను. అని సంధ్య డిమాండ్ చేశారు.