భార్యలను భర్తలు హత్య చేసిన వార్తలెన్నో చదివాం. ఇష్టం లేని పెళ్లిళ్లో, అక్రమ సంబంధాలో మరేవో కారణాలతోనో పెళ్లి బంధాలు పుటుక్కున తెగిపోయిన ఎన్నో కథలు విన్నాం. కానీ మనసారా ప్రేమించుకుని, పెళ్లి చేసుకోకుండానే చిలకా గోరెంకల్లా చక్కగా జీవిస్తున్న లివిన్ రిలేషన్‌షిప్ బంధాలు కూడా కాలమహిమ వల్ల విషాదాలకు దారితీస్తున్నాయి. అయినవాళ్లను కాదనుకుని వచ్చిన అమ్మాయిలను కొందరు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా చంపేస్తున్నారు.
క్రిమినల్ మైండ్ సెట్ తో శవాలను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ అనే యువతిని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా 32 ముక్కలుగా నరికి పారేసిన ఉదంతంలాంటివి దేశవ్యాప్తంగా ఎన్నో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోనే నిక్కీ యాదవ్ అనే యువతిని సాహిల్ గెహ్లాట్ అనే ప్రియుడు కేబుల్ వైరుతో చంపి ఫ్రిజ్జులో పెట్టాడు. మరింత తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో అలాంటి ఘోరమే జరిగింది.
ఫర్నీచర్ అమ్మేసి..
ఓ దుర్మార్గుడు తనతో సహజీవనం చేస్తున్న మహిళను దారుణంగా చంపి పరుపులో దాచిపెట్టాడు. దుర్వాసన వస్తుండడంతో బండారం బయటపడింది. నలసోపారాకు చెందిన హార్దిక్ షా (27).. మేఘాధన్‌సింగ్ తోర్వి అనే 35 ఏళ్ల మహిళతో ఓ అద్దెంట్లో సహజీవనం చేస్తున్నాడు. హార్దిక్‌కు ఉద్యోగం లేదు. వారం కిందట ఇద్దరికీ మధ్య ఏదో గొడవ జరిగింది. హార్దిక్ కోపం పట్టలేక తోర్విని చంపేశాడు. తర్వాత ఇంట్లోని ఫర్నీచర్ అమ్మేసి పారిపోయాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా శవం కనిపించింది.