ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్.. తన పొలాన్ని ఆక్రమించారంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లాలోని దర్శిలో జరిగిన స్పందన కార్యక్రమానికి కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ క్రమంలో మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ అనే మహిళ.. మంత్రి సురేష్‌కి చెందిన జార్జ్ ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో తమకు మూడెకరాల భూమి ఉందని.. ఆ పొలాన్ని ఆయన ఆక్రమించారని వాపోయారు. తన పుట్టింటి వారు ఇచ్చిన ఆ పొలం పంచాయితీ గురించి ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని.. న్యాయం చేయాలని కోరారు. ఈ వ్యవహారంపై ఆదిమూలపు సురేష్ స్పందించాల్సి ఉంది.. ఏకంగా మంత్రిపై మహిళ ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.