ఈ పోలీసుకు ఆఫీసులో భార్యే బాస్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పోలీసుకు ఆఫీసులో భార్యే బాస్

January 20, 2020

bhnbg

సినిమాల్లో భర్తకు పై ఆఫీసర్‌గా భార్యలు ఉండటం చూసి ఉంటాం. కొన్నిసార్లు ఈ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. నిజ జీవితంలోనూ అచ్చంగా అలాంటి ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ ఐపీఎస్ అధికారిణి ఏకంగా తన భర్తకు బాస్ కాబోతున్నారు. యూపీలో జరిగిన పోలీసు బదిలీల్లో ఇది చోటు చేసుకుంది. అనుకోకుండా జరిగిన ఈ మార్పు ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో ఇప్పుడు వీరిపై పెద్ద చర్చే సాగుతోంది. 

నాగాలాండ్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి వృందా శుక్లాను నోయిడాలోని మహిళా యూనిట్‌కు డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలుబడ్డాయి. అదే సమయంలో ఆమె భర్త అంకుర్ అగర్వాల్ అడిషినల్ పోలీస్ కమిషనర్‌గా నియమితులు అయ్యారు. వీరిద్దరికి ఒకే చోట పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తన భార్య వద్ద ఆయన ఏసీపీగా పనిచేయాల్సి వచ్చింది. 2014 బ్యాచ్‌కు చెందిన వృందా శుక్లా లఖ్‌నపూ నుంచి బదిలీ అయ్యారు. 2016 బ్యాచ్‌కు చెందిన అంకుర్ నోయిడాలో ఎస్పీగా చేస్తున్న ఆయనకు అదే ప్రాంతంలో ఏసీపీగా పదోన్నతి వచ్చింది. ఈ నియామకంతో ఆయనకు భార్యే బాస్ కావడం విశేషం. 

కాగా ఐపీఎస్ ఎంపికైన బ్యాచ్‌లో అంకుర్ అగర్వాల్ తన భార్య కంటే రెండు సంవత్సరాలు జూనియర్. వీరిద్దరు కుటుంబాలు చిన్నప్పటి నుంచి హరియాణాలోని అంబాలా ప్రాంతంలో ఇరుగు పొరుగుగా ఉండే వారు. జీసస్‌ అండ్‌ మేరీ స్కూల్లోనే చదువుకొని ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈ పరిచయం కాస్త వీరి పెళ్లికి దారి తీసింది. 2019లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు భర్త కంటే భార్య పెద్ద పోస్టులో ఉండి అతన్ని రూల్ చేయడం అందరిలోనూ ఆసక్తిని పెంచింది.