అద్భుతం.. తల్లి పుట్టిన గర్భసంచి నుంచే బిడ్డ కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

అద్భుతం.. తల్లి పుట్టిన గర్భసంచి నుంచే బిడ్డ కూడా..

October 19, 2018

వైద్యులు అపరబ్రహ్మలు. సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు. మొన్న పుర్రెను మార్చిన పుణే వైద్యులు ఈసారి మరో అద్భుతం చేశారు. గర్భసంచి మార్పిడి ద్వారా ఒక భావోద్వేగ జన్మకు కారణభూతులయ్యారు. తల్లి జన్మించిన గర్బసంచి నుంచి ఆమె బిడ్డ కూడా పుట్టేలా చేశారు. ఆసియాలోనే తొలిసారిగా గర్భసంచి మార్పిడి తర్వాత ఓ మహిళ బిడ్డకు జన్మనివ్వడం ఇదే తొలిసారి.

ytrt

పుణేలోని గెలాక్సీ కేర్‌ ఆస్పత్రిలో ఈ అపూర్వ వైద్యం జరిగింది. గుజరాత్‌కు చెందిన మీనాక్షి(27) అనే మహిళలకు పుట్టుకతోనే గర్భసంచి లేకపోవడం వల్ల ఏడేళ్లుగా సంతానానికి దూరమైంది. ఎవరైనా గర్భసంచి దానం చేయాల్సిన పరిస్థితి. ఎవరి కోసమో ఎదురుచూడకుండా మీనాక్షికి ఆమె తల్లే గర్భసంచిని దానం చేసింది. 17 నెలల కిందటతొమ్మిది గంటలు సర్జరీ చేసి తల్లి గర్భసంచిని మీనాక్షికి అమర్చారు. తర్వాత తమ పర్యవేక్షణలోనే ఉంచుకున్నారు. పూర్తి కోలుకున్న తర్వాత ఇంటికి పంపారు. మీనాక్షి కల నెరవేరింది. మార్చిలో గర్భం దాల్చింది. ప్రత్యేక పరిస్థితి వల్ల 32 వారాల 5 రోజుల గర్భస్థ శిశువును సీజేరియన్‌ ద్వారా ఈ లోకంలోకి తీసుకొచ్చారు. 1.4 కేజీల బరువున్న పాప, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. తనకు బిడ్డ పుట్టిందని వైద్యులు చెప్పగానే కళ్లనిండా నీళ్లతో చేతులెత్తి నమస్కరించింది ఆ మాతృమూర్తి. ఈ మహాయాగాన్ని డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని 18 మంది వైద్యులు నిర్వహించారు. వైద్య చరిత్రలో ఇదో అద్భుతమని, గర్భసంచి లేని మహిళలు ఇక కుంగిపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

45