సీఎం సారూ..ఏమిటీ దారుణం
కుయ్ కుయ్ మోతలు ఏమయ్యాయ్. క్షణాల్లో వచ్చే అంబులెన్స్ ఎక్కడ? కిందమీద పడుతూ పురిటినొప్పులతో వచ్చిన మహిళను ఆసుపత్రిలో చేర్చుకోనిదెవరు?ఆమె వెంట అటెండర్స్ లేకపోతే ఆసుపత్రిలో చేర్చుకోరా? రోడ్డుపైనే మహిళ ప్రసవానికి కారణమైందెవరు? వెంకన్న సన్నిధి తిరుపతిలో ఇదేం దారుణం?
నిర్వాకం
తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రికి ఓ మహిళ పురిటినొప్పులతో వచ్చింది. ఆమెకు అడ్మిషన్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారు. వంద పడకల ఆసుపత్రిలో చేర్చుకోవడానికి రూల్స్ అడ్డొచ్చాయి. గర్బిణీ వెంట ఎవరూ రాలేదని చేర్చుకోవడానికి నిరాకరించారు. అక్కడ నుంచి బయటకొచ్చిన గర్భిణీకి నొప్పులు ఎక్కుయ్యాయి. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై తల్లడిల్లింది. ఇది చూసిన కొందరు చలించిపోయారు. సాయం చేయడానికి ముందుకు వచ్చారు. బెడ్ షీట్‌తో కవర్ చేశారు. ఒకతను ఆమె కనపడకుండా బెడ్ షీట్ అడ్డు ఉంచాడు. హెల్త్ వర్కర్ వచ్చి కాన్పు చేసింది. రోడ్డుపైనే పండంటి బిడ్డకు ఆమె జన్మనించింది. ఆ తర్వాత తల్లిని, చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించారు.
ఎవరిదీ నిర్లక్ష్యం
ఈ ఘటనపై తిరుపతి డీఎంహెచ్ఓ శ్రీహరి విచారణకు ఆదేశించారు. ఎవరైనా సిబ్బంది తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. అటెండర్స్ లేకపోయినా గర్భిణీల్ని ఆసుపత్రిలో చేర్చుకోవాల్సిందేనన్నారు. అటు ఈ సంఘటనపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆరాతీశారు . అసలేం జరిగిందో నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.
చర్యలకు డిమాండ్
తిరుపతి మెటర్నిటీ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని టీడీపీ నాయకురాలు సుగుణ తప్పు పట్టారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పేరుకే వంద పడకలు
తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్‌లో వంద పడకలు ఉన్నాయి. ఎంతో మంది సిబ్బంది ఉన్నారు. ఎప్పుడూ అందుబాటులో డాక్టర్లు, నర్సులు ఉంటారు. కానీ పురిటినొప్పులతో వచ్చిన గర్భిణీపై కనికరం చూపలేదు. ఆమె వెంట ఎవరు లేరని రోడ్డుపైకి గెంటేశారు. అక్కడున్న వారు సాయం చేశారు కాబట్టి ఆమెకు సేఫ్ డెలివరీ అయింది. లేదంటే ఎవరు బాధ్యులు?వేలకువేలు జీతాలు తీసుకోవడం కాదు…చేసే పనిపై కాసింత ప్రేమ చూపెట్టాలని స్థానికులు అంటున్నారు.