దేవుడి కరుణిస్తే కానుకలు సమర్పించుకుంటాం. మొక్కు నెరవేరకపోతే ఓపికతో వేచి చూస్తాం. ఒక దేవుడిపై నమ్మకం లేకపోతే మరో దేవుడికి మొక్కకుంటాం. కానీ దేవుణ్ని తూలనాడం. ఇదీ సాధారణ భక్తుల మనోగతం. దేవుడంటే గిట్టని నాస్తికుల సంగతి వేరు. కానీ కొంతమంది భక్తులకు అప్పుడప్పుడు దేవుళ్లపై కోపం వస్తుంటుంది. తిడుతుంటారు కూడా. దీన్ని నిందాస్తుతి అంటారు. ఏదేమైనా భక్తులెవరూ దేవుళ్ల విషయంలో అపరాచారాలకు పాల్పడరు. కానీ ఓ భక్తురాలు మాత్రం దారుణమైన అపచారానికి పాల్పడింది. దేవుడిని తిడుతూ పాదరక్షలతో దాడి చేసింది. దేవుడు తనను మోసం చేశాడని, ధనాన్ని తనకు దూరం చేశాడని మండిపడింది.
మహబూబ్ నగర్ జిల్లా కొత్తగూడ మండలం నిలంపల్లి హనుమాన్ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. ఎదుల్లపల్లికి చెందిన ఓ మహిళ విగ్రహాన్ని 11 సార్లు కాలితో తన్నింది. దేవుడు తనను ఆగం చేశాడని తిట్టిపోసింది. ఆమె అపచారం చూసిన జనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియడం లేదు.