మెడికల్ షాపు నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి - MicTv.in - Telugu News
mictv telugu

మెడికల్ షాపు నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి

March 7, 2022

 

dcf

మందులు అమ్మే మెడికల్ షాపువాడు చేసిన పొరపాటు వల్ల నిండు ప్రాణం బలయ్యింది. డాక్టర్ రాసిన మందులు కాకుండా వేరే మందులు ఇవ్వడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజంపేటలోని ఎర్రబల్లికి చెందిన కె. సుబ్బనరసమ్మ అనారోగ్యానికి గురవడంతో కడపలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి వెళ్లారు. పరీక్షల అనంతరం ఆమెకు థైరాయిడ్ రోగం ఉందని ధృవీకరించిన డాక్టర్లు రోగ నివారణకు మందులు రాసిచ్చారు. మందులను రాజంపేటలోని ఓ మెడికల్ షాపులో కొనుగోలు చేశారు. వాటిని డాక్టర్ సూచన ప్రకారం రోజూ వాడిన నరసమ్మకు రోజురోజుకూ ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ డాక్టరుని కలిశారు. అనుమానం వచ్చిన డాక్టర్ తాను రాసిచ్చిన మందులను పరిశీలించగా, యాంటీ థైరాక్సిన్ బదులు థైరాక్సిన్ సోడియం మందులు ఇచ్చినట్టు తేలింది. దీంతో మెడికల్ షాపుపై గత నెల 24వ తేదీన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నరసమ్మను నెల్లూరులోని హాస్పిటల్‌లో చేర్పించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై ప్రసాదరెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.