పాముకాటుతో ఓయూ హాస్టల్‌లో పనిచేస్తున్న ఉద్యోగిని మృతి
పాము కాటుతో ఉస్మానియా యూనివర్సిటీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందింది. కవిత అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని లేడీస్ హాస్టల్లో వంట చేస్తుండగా పాటు కాటు వేసింది. దీంతో ఆమె వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చివరకు గాంధీ ఆస్పత్రికి చేరుకునేలోపు కవిత కన్నుమూసింది. పాము కరిచిన విషయాన్ని ఓయూ అధికారులు, కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కవిత భర్త ఆరోపిస్తున్నాడు.
లేడీస్ హాస్టల్ లో పలు చోట్ల ఉన్న బొరియల్లో పాములు ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సమాచారం. తన భార్య మృతికి కారణమైన ఓయూ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలు కవిత భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. మరోవైపు కవిత మృతి విషయం తెలిసిన విద్యార్థి సంఘాలు, పలు రాజకీయ పార్టీల నేతలు ఓయూ హాస్టల్ వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా యూనివర్సిటీలో పనిచేస్తున్న కవితకు న్యాయం చేయాలని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.