మహిళా అటవీ అధికారిపై కారంపొడితో దాడి - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా అటవీ అధికారిపై కారంపొడితో దాడి

October 29, 2019

రైతుకు మండితే కారం పొడిలా మండిపోతాడని నిరూపిస్తున్నారు. కన్నెర్రజేస్తే ఎదుట ఉన్నది ఎవరైనా సరే అని ధైర్యంగా కాలు దువ్వుతున్నారు. తమ పొలంలో మొక్కలను పెరికిపారేశారని అటవీ అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. కారంపొడి చల్లి మరీ దాడి చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో పోడు భూమిలో గత కొంతకాలంగా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ భూమిలో మామిడి మొక్కలను పెంచుతున్నారు.

Woman FBO assaulted.

ఈ విషయం తెలిసిన అటవీ అధికారులు ఆ చెట్లను నరికేశారు. దీంతో ఆగ్రహం చెందిన నలుగురు రైతులు కారంపొడి చల్లి అటవీ అధికారి, బీట్ ఆఫీసర్ స్వప్నపై దాడి చేశారు. ఈ దాడిలో స్వప్నకు స్వల్ప గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ‘గత కొంత కాలంగా ఈ భూమి అటవీ శాఖకు చెందిందని ఎన్నోసార్లు చెప్పాం. అయినా వారు వినలేదు. దీంతో చర్యలు తీసుకుంటే కారం పొడి చల్లి మాపై దాడి చేశారు’ అని బీట్ ఆఫీసర్ స్వప్న ఆరోపించారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుతో నలుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.