తాను పెంచుకుంటున్న కోడిపై హత్యాయత్నం జరిగిందని , పక్కింటి మహిళ చంపాలని చూసిందని ఓ మహిళ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. పోలీస్ స్టేషన్‌కు కోడితో సహ వెళ్లిన ఆమె.. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను కోరింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మహిళ ఫిర్యాదుతో ఆశ్చర్యపోయిన పోలీసులు ఆమెను కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ, మహిళ మాత్రం ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేసింది. చివరి పోలీసులు ఆమెకు నచ్చజెప్పి అసలేం జరిగిందో ఆరా తీయడంతో అసలు విషయాన్ని పోలీసుల వద్ద మహిళ వాపోయింది.
ఛత్తీస్‍గఢ్‌లోని బిలాస్ పూర్ ప్రాంతంలోని రతన్‌పూర్ పీఎస్ పరిధిలోని సిల్దాహా గ్రామానికి చెందిన జాంకీబాయి బింజ్వార్ అనే మహిళ దేశవాళీ కోళ్లను పెంచుతుంది. ఈ క్రమంలో కోళ్లు అటు ఇటూ తిరుగుకుంటూ పక్కన ఇళ్లకు వెళ్తుండేవి. పక్కనే ఇంట్లో నివాసం ఉండే ఓ మహిళ తన కోడిని చంపాలని చూసిందని, కోడిని పట్టుకొని కత్తితో గాయంచేసే ప్రయత్నం చేయగా నేను గమనించడంతో కోడిని వదిలేసిందని తెలిపింది. దీంతో నా కోడికి స్వల్ప గాయమైంది. నా కోడిని ఉద్దేశపూర్వకంగా చంపేందుకు యత్నించిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సదరు మహిళ పోలీసులను డిమాండ్ చేసింది. పోలీసులు ఎంత చెప్పినప్పటికీ మహిళ వినకపోవటంతో ఆమె భర్తను స్టేషన్‌కు పిలిపించారు.
భర్తసైతం మహిళకు మద్దతుగా మాట్లాడి పక్కింటి మహిళపై కేసు నమోదు చేయాలని పట్టుబట్టాడు. చేసేదేమీలేక పోలీసులు కోడిని చంపేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను స్టేషన్ కు పిలిపించారు. అసలు విషయం పై ఆరాతీయగా.. కోడిని నేనే చంపేందుకు ప్రయత్నించలేదని ఆ మహిళ చెప్పింది. దీంతో ఇరువురికి నచ్చజెప్పి వారి మధ్య సయోధ్య కుదుర్చి పోలీసులు వారిని స్టేషన్ నుంచి పంపించివేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.