ఆమె వయసు 31 ఏళ్లు. పెళ్లైంది. భర్త, పిల్లలున్నారు. ఏమైందో తెలియదు కానీ ఎదురింట్లో ఉండే 14ఏళ్ల బాలుడిపై మనసు పడింది. అతనికి మాయమాటలు చెప్పి, ఈ వయసులో చేయకూడని పనులన్నీ చేయించి, హైదరాబాద్ తీసుకొని వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం సృష్టించిన మహిళ, బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. గుడివాడ పట్టణానికి చెందిన స్వప్న అనే మహిళకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.
కొంతకాలంగా వారి ఎదురింట్లో ఉండే ఎనిమిదవ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడితో చనువుగా ఉంటోంది. ఆ చనువుతోనే బాలుడిని ఆమె శారీరకంగా లోబర్చుకుంది. 8వ తరగతి చదువుతున్న ఆ బాలుడు ఈ కారణంగా స్కూల్కు కూడా వెళ్లకుండా ఆమె ఇంటికే వెళ్లేవాడు. దీంతో అతడి తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. ఈ విషయం బాలుడు ఆమెతో చెప్పాడు. దీంతో అతడు తనకు దూరమవుతాడని భావించి, మాయమాటలు చెప్పి ఈనెల 19న బలవంతంగా హైదరాబాద్ తీసుకెళ్లింది. వివాహితపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విచారణ జరిపారు.
మహిళ ఫోన్ కాల్ డేటా, సిగ్నల్స్ ను విశ్లేషించిన పోలీసులు.. ఇద్దరి ఫోటోలతో గాలించారు. చివరకు హైదరాబాద్ బాలానగర్ లోని ఓ గదిలో బాలుడితో పాటు మహిళ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి ఆమెతో పాటు బాలుడ్ని గుడివాడ తీసుకొచ్చారు. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. బాలుడితో కలిసి శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయినట్లు అంగీకరించింది. దీంతో ఆమెపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితురాలిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.