ఇటీవల కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులకు వల వేసి లక్షలు దోచేస్తున్నారు కిలేడీలు. తాజాగా ఓ మాయ లేడి చేతిలో మరో యవకుడు మోసపోయాడు. హీరోయిన్ కీర్తి సురేష్ ఫోటో గుర్తుపట్టలేక ఏకంగా 40 లక్షలు పోగొట్టుకున్నాడు. కీర్తీ సురేష్ డీపీ పెట్టి ఓ ఆంటీ చేసిన చాటింగ్‌కు మురిసిపోయాడు. అబ్బా అమ్మాయి హీరోయిన్లా ఉందే అని సంబరపడిపోయి సర్వస్వం అప్పజెప్పాడు. చివరికి మోసపోయిన విషయం గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగులు పెట్టాడు.
కర్ణాటకకు చెందిన పరశురామ అనే యువకుడు హైదరాబాద్‌లోని ఓ కనస్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఫేస్ బుక్‌లో మంజుల అనే ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమె తన ఫేస్ బుక్ డీపీ దగ్గర తన ఫొటోకి బదులుగా కీర్తి సురేష్ ఫొటోని పెట్టింది. ఈ డీపీ మంజులదే అని నమ్మిన యువకుడు ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. రోజూ చాటింగ్ చేస్తు ప్రేమలో మునిగిపోయాడు. అంతా ప్లాన్ ప్రకారం కొన్ని రోజులు నడిపిన ఆ మహిళ ఇక ఆసలు స్క్రీన్ ప్లేను బయటకు తీసింది. తనకు ఆర్థిక కష్టాలు ఉన్నాయని సాయం చేయాలని యువకుడిని కోరింది.
సెంట్రల్ గవర్న్ మెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న తనకు అండగా ఉండాలని వేడుకొంది. ఆమె మాటలకు కరిగిపోయిన పరశురామ 40 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాడు. ఐదు లక్షల నగదుతో పాటు ప్లాట్‌తో సహా అన్నీ అమ్మేసి ఆమెకు డబ్బులు పంపించాడు. అయితే ఇంత జేస్తున్న ఆమె ఒక్కసారి కూడా తనను కలవకపోవడంపై అనుమానం వచ్చిన పరుశరామ అప్రమత్తమయ్యాడు. ఏదో తేడా కొడుతుందని భావించి తన డబ్బులు తనకు ఇచ్చేయాలని అడిగాడు. దీంతో మరోప్లాన్ కు తెరలేపింది మంజుల. అతడిని న్యూడ్ కాల్ మాట్లాడాలని చెప్పి దానిని రికార్డ్ చేసింది.
ఈ సమయంలో ఆమె కనబడకుండా జాగ్రత్తలు పాటించింది. ఆ వీడియోను రికార్డ్ చేసి బెదిరింపులకు దిగింది. డబ్బులు అడిగితే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేసింది. చివరికి అతడు పోలీసులను ఆశ్రయించడంతో కథ క్లైమెక్స్కు చేరి జైలుపాలయ్యింది. పరశురామ నుంచి వసూలు చేసిన డబ్బుతో ఆమె 100 గ్రాముల బంగారం, హ్యుండాయ్ కారు, బైక్ కొనుగోలు చేసి పట్టణంలో ఇల్లు కూడా కడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ మోసానికి మంజుల భర్త పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వెలుగులోకి రావడంతో అతడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
ఆ మహానటి కోసం తెలియక ఈ మహానటి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు యువకుడు. ఏదైమైనా సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. గుడ్డిగా నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.