ఆమెను జీపుపైన కట్టేసి, పడేసి.. ఖాకీల కండకావరం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆమెను జీపుపైన కట్టేసి, పడేసి.. ఖాకీల కండకావరం..

September 26, 2018

ఆడవాళ్లను కర్రకు కట్టి బండ్లలో ఊరేగించడం పౌరాణిక సినిమాల్లో చూశాం. కీచకుడు చచ్చాక ద్రౌపదిని అలా కట్టేసి వధ్యస్థలికి తీసుకెళ్తారు. అలాంటి ఘోరం మన కళ్లముందే జరిగింది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ రాక్షసకాండకు పాల్పడ్డారు. ఒక మహిళను  ఖాకీలు దారుణంగా హింసించి కండకావరాన్ని నిస్సిగ్గుగా ప్రదర్శించుకున్నారు. మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

t

బాధితురాలు చౌవిండా దేవి కాలనీలో నివసిస్తోంది. ఆస్తి తగాదాలో ఆమె మామను ప్రశ్నించేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతను అక్కడ లేకపోవడంతో అతని కొడుకును పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు యత్నించారు. దీనికి అతని భార్య అడ్డుచెప్పింది. తన భర్తకేం తెలిదనీ, అతణ్ని తీసుకెళ్లొద్దని వేడుకుంది.  దీంతో రెచ్చిపోయిన పోలీసులు మాకే అడ్డువస్తావా? అంటూ ఆమెను పోలీస్ జీప్ మీద కట్టేశారు. ఆమె ఏదో పెద్ద నేరం చేసినట్లు ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. ఓ మూలమలుపు వద్ద జీప్ వేగంగా మలుపు తిరగడంతో ఆమె పైనుంచి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ తతంగమంతా నగరంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ దారుణానికి పాల్పడిన పంజాబ్ క్రైం బ్రాంచ్ పోలీసులపై ఉన్నతాధికారులు మాత్ర ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.