మహిళా జర్నలిస్టు హత్య - MicTv.in - Telugu News
mictv telugu

మహిళా జర్నలిస్టు హత్య

September 6, 2017

కర్ణాటకు చెందిన ప్రముఖ పాత్రికేయరాలు, మత సామరస్యవాది గౌరీ లంకేశ్ మంగళవారం రాత్రి బెంగళూరులో దారుణ హత్యకు గురయ్యారు. రాజరాజేశ్వరినగరలోని గౌరి ఇంటి వెలుపల రాత్రి 8 గంటల సమయంలో ఆమెను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. తమకు తాగడానికి మంచినీళ్లివ్వాలంటూ వచ్చి దారుణానికి పాల్పడ్డారు. మోటార్ బైకులపై వచ్చిన ముగ్గురు దుండగులు అతి సమీపం నుంచి రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు తూటాలు గౌరి నుదురు, మెడ, ఛాతీలోకి దూసుకెళ్లాయి. రెండు గోడకు తగిలాయి. ఆమె అక్కడికక్కడే చనిపోయారు.  మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు.  55 ఏళ్ల గౌరి వివాహిత. కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన లంకేశ్ పత్రికను నిర్వహిస్తున్నారు. మూఢనమ్మకాలు, హిందూమతోన్మాదంపై పోరాడుతున్నారు. బడుగువర్గాల కష్టాలు తీర్చేందుకు ఉద్యమిస్తున్నారు. గత ఏడాది బీజేపీ నేతలు వేసిన పరువు నష్టం కేసులో ఆమెకు 6 నెలల జైలు శిక్ష పడింది. బెయిలుపై బయటికొచ్చారు.

మహారాష్ట్రలో హేతువాది నరేంద్ర దబోల్కర్‌, కమ్యూనిస్టు నేత పన్సారే కర్ణాటక ధార్వాడలో రచయిత ఎం.ఎం.కలబుర్గిలు హత్యకు గురైన నేపథ్యంలో గౌరి హత్య జరగడం గమనార్హం. హిందూ ఉగ్రవాదుల నించి ఆమెకు ఇదివరకు బెదిరింపులు వచ్చాయి. గౌరిని హత్య చేసినవారిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మూడు పత్ర్యేక గాలింపు టీంలను ఏర్పాటు చేశారు. గౌరి హత్యపై కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా నిరసలు పెల్లుబుకుతున్నాయి. దుండగులను శిక్షించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు.