వేధింపులకు పాల్పడుతున్న మామను చితకబాది హత్య చేసిందో కోడలు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని గోపాలపేట మండలం చెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రకళ అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి కొన్నాళ్లుగా మానసిక ఆరోగ్యం బాగాలేక సతమతమవుతున్నాడు. కొడుకు పరిస్థితిని ఆసరాగా చేసుకున్న తండ్రి రాములు (58) కోడలిపై కన్నేశాడు. ఆమెను లైంగికంగా వేధిస్తుండే వాడు.
అతడి వేధింపులు తాళలేక.. చంద్రకళ తన సోదరుడితో బాధను పంచుకుంది. ఇద్దరు కలసి రాములు ని మందలించే క్రమంలో వ్యవసాయ బావి వద్ద చంద్రకళ తన మామపై కర్రతో తీవ్రంగా దాడి చేసి కొట్టింది. దీంతో రాములు దెబ్బలు తాళ లేక అక్కడే పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీనిపై స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దాడి చేసిన కోడలును, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధితురాలు తనపై మామ వేధింపులకు దిగిన సందర్భంలో రహస్యంగా వీడియోలు తీసినట్లు తెలిసింది. ఇవి పోలీసులకు అందజేసినట్లు సమాచారం.