woman left her husband and ran away with her lover in Bihar’s Motihari
mictv telugu

భార్య హత్య కేసులో భర్తకు జైలు.. లవర్‌తో ప్రత్యక్షమైన భార్య..

July 28, 2022

woman left her husband and ran away with her lover in Bihar’s Motihari

భార్య, కొడుకుతో ఆనందంగా జీవితం గడుపుతున్న అతడికి అనుకోని సమస్య ఎదురైంది. అకస్మాత్తుగా అతని భార్య అదృశ్యమవడంతో.. తమ కూతురిని అల్లుడే హత్య చేయించాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే నెలన్నర తర్వాత ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. చనిపోయిందని భావించిన ఓ మహిళ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా నిముయిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

షేక్ సద్దాం అనే వ్యక్తి భార్య నజ్నీన్ ఖాతున్ నెలన్నర క్రితం అదృశ్యమైంది. అదే క్రమంలో గ్రామ శివారులో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో.. ఆ శవం తన కూతురిదేనని, అల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె తండ్రి షఫీ అహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సద్దాంను అదుపులోకి తీసుకున్నారు. తమ కొడుకు నిర్దోషి అని షేక్ సద్దాం తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు. అయితే నెలన్నర తర్వాత ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

చనిపోయిందనుకున్న నజ్నీన్ ఖాతున్ మోతిహారి నగరంలో బతికే ఉన్నట్లు తెలిసింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన నజ్నీన్ ఖాతున్ తన కుమారుడితో కలిసి పరారైంది. భర్తను హత్య కేసులో ఇరికించేందుకు ప్రియుడితో కలిసి ఈ పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నజ్నీన్ ఖాతున్ బతికే ఉన్నందున షేక్ సద్దాం త్వరలో జైలు నుంచి విడుదలవుతాడని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.