రైల్వేస్టేషన్‌లో గ్యాంగ్ రేప్.. ఈ సారి స్టేషన్ ఉద్యోగులే
దేశంలో అత్యాచారాల గురించి రోజూ వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల మృగాళ్ల విపరీత ధోరణి కారణమైతే మరి కొన్ని చోట్ల మహిళల అశక్తత కారణమవుతోంది. మహిళల పరిస్థితిని ఆసరాగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళను నమ్మించి నలుగురు రైల్వే ఉద్యోగులు రైల్వే స్టేషనులోనే అత్యాచారం చేశారు.
ఉద్యోగుల్లో కలకలం రేపిన ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌కి చెందిన 30 ఏళ్ల మహిళ భర్త నుంచి విడిపోయి బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తన స్నేహితుడి ద్వారా బాధితురాలికి సతీష్ అనే రైల్వే ఉద్యోగి పరిచయమయ్యాడు. రైల్వేలోనే ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు తన కొడుకు పుట్టినరోజు వేడుకలకు రమ్మని మహిళను ఆహ్వానించాడు. అతని కుట్ర తెలియక అమాయకురాలైన బాధితురాలు అతను చెప్పిన కీర్తి నగర్ మెట్రో స్టేషన్ ప్రాంతానికి రాత్రి 10.30కి వెళ్లింది. అక్కడ మహిళను కలుసుకున్న సతీష్.. ఆమెను న్యూఢిల్లీ రైల్వే స్టేషనుకి తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ప్లాట్‌ఫారం పక్కన ఉన్న ఎలక్ట్రికల్ మెయింటేన్స్ రూంలో లాక్కెళ్లి బలవంతంగా అనుభవించారు. తర్వాత భయంతో నిందితులు ఆమెను అక్కడే వదిలేసి పారిపోగా, బాధితురాలు తెల్లవారు ఝామున 3.7 గంటలకు మేల్కొంది. తేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నలుగురిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ హరేంద్ర సింగ్ మీడియాకు వెల్లడించారు.