మతిమరుపు భర్తతో మళ్లీ పెళ్లి.. సినిమా కాదు! - MicTv.in - Telugu News
mictv telugu

మతిమరుపు భర్తతో మళ్లీ పెళ్లి.. సినిమా కాదు!

August 21, 2019

Woman remarries husband with dementia who can't..

గతం మర్చిపోయిన భర్తను ఓ ఇల్లాలు మళ్ళీ పెళ్లిచేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. స్కాట్‌లాండ్‌కు చెందిన అన్నే డంకన్‌ 12 ఏళ్ల క్రితం బిల్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటికే వారికి వయసు పైబడింది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఆయనకు డిమెన్షియా (మతిమరపు వ్యాధి) వచ్చింది. ఎంత మతిమరపంటే.. ఇంట్లో తిరుగుతున్న భార్యనే గుర్తుపట్టలేనంత.  కనీసం ఆమె పేరు కూడా ఆయనకు గుర్తులేదు. దీంతో అన్నేకు ఎంతో బాధగా ఉండేది. కానీ, గత శుక్రవారం బిల్‌ హఠాత్తుగా తన భార్య వద్దకు వచ్చి షాకిచ్చాడు. ‘నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీతోనే నేను జీవితాంతం ఉండిపోతాను’ అన్నాడు.

దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. బిల్ ఈ రోజు చెప్పిన మాటలు రేపటికి మరచిపోతాడులే అనుకుంది. కానీ, మరుసటి రోజు కూడా అతడు ప్రేమగా దగ్గరికి పిలిచి..  ‘మన పెళ్లి విషయం ఏం చేశావు ?’ అని అడిగాడు. దీంతో నిన్నటి విషయాలు కూడా గుర్తున్నాయే అనుకుని ఆమె సంతోషించింది. వెంటనే కూతురు ఆండ్రియాకు ఫోన్‌ చేసి పెళ్లి కూతురు గౌన్‌ ఆర్డర్‌ చేసింది. ఆదివారం సాయంత్రం ఇంటి వెనకనున్న గార్డెన్‌లో ‘పెళ్లి నాటి ప్రమాణాలతో’ మళ్లీ పెళ్లిచేసుకున్నారు. అన్నే ఈ సంబరాన్ని ‘ఫేస్‌బుక్‌’ మిత్రులతో పంచుకోవడంతో అది ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ సంఘటనను సినిమాగా తీయచ్చని పలువురు నెటిజన్లు ప్రసంశిస్తున్నారు.