Woman school teacher burnt alive, no arrest even after 7 days of incident
mictv telugu

మహిళా టీచర్ సజీవ దహనం.. సెల్‌ఫోన్‌లతో వీడియో తీశారు తప్ప..

August 17, 2022

అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని అడిగినందుకు ఓ దుర్మార్గుడు.. మరికొందరు వ్యక్తులతో కలసి మహిళా ఉపాధ్యాయురాలిని సజీవ దహనం చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. అక్కడే ఉన్న స్థానికులు వారి బారి నుండి ఆ మహిళను కాపాడే ప్రయత్నం చేయకపోగా.. సెల్‌ఫోన్‌లతో ఆ ఘటనను వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. దాదాపు 7 రోజుల క్రితం రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు సమీపంలో రైసర్ గ్రామంలో ఆగస్టు 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది

ఆ రోజున అంటే గత బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో అనితా రేగర్ (32) అనే స్కూల్ టీచర్ తన కుమారుడితో కలిసి పాఠశాలకు వెళుతోంది. ఆ సమయంలో కొందరు దుండగులు అనితను చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె పరుగులు పెట్టింది. వెంబడించిన నిందితులు అనితపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటలు చెలరేగడంతో అనిత భయంకరంగా కేకలు పెట్టింది. సమాచారం అందుకున్న అనిత భర్త తారాచంద్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భార్యను ఆసుపత్రిలో చేర్చారు. హాస్పిటల్‌లో సుమారు ఏడు రోజుల పాటు చికిత్స అందుకున్న అనిత చివరకు మంగళవారం రాత్రి మరణించింది. తారాచంద్ నిందితుల గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో తారాచంద్ డీజీపీని ఆశ్రయించారు. డీజీపీ ఆదేశాలతో స్థానిక పోలీసుల్లో చలనం వచ్చింది. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నిందితుడికి అనిత కొన్నేళ్ల క్రితం రెండున్నర లక్షలు ఇచ్చినట్టు సమాచారం. ఆ డబ్బులు తిరిగి అడగడంతోనే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.