మా తల్లే.. పేపర్లతోపాటు బంగారాన్నీ అమ్మేసింది! - MicTv.in - Telugu News
mictv telugu

మా తల్లే.. పేపర్లతోపాటు బంగారాన్నీ అమ్మేసింది!

November 23, 2019

Woman sells gold along with old papers, gets it back..

ఇంట్లో ఉన్న బంగారాన్ని దొంగలు వచ్చి ఎక్కడ ఎత్తుకుపోతారో అని ఓ మహిళ మాస్టర్ ప్లాన్ వేసింది. సాధారణంగా దొంగలు ఇంట్లోకి చొరబడ్డాక బీరువాలు, సూటుకేసులు వెతుకుతారు. అంతేగానీ పాత పేపర్లు, చెత్త బుట్ట వద్దకు అస్సలు వెళ్లరు. అక్కడ ఏం ఉండదని వారికి బాగా తెలుసు. కానీ ఆ మహిళ మాస్టర్ ప్లాన్ అదే.. ఇట్లోని బంగారాన్ని పేపర్లో చుట్టి పాత పేపర్లో పెడితే దొంగలు పట్టించుకోరని అనుకుంది. అంతే బంగారాన్ని పాత పేపర్లలో పెట్టి సేఫ్ అనుకుంది. అయితే ‘తానొకటి తలిస్తే తలరాత ఒకటి తలచిందట’ అన్న చందంగా ఆమె మాస్టర్ ప్లాన్ ఆమెకే బెడిసికొట్టింది. అదికూడా స్వయంకృతాపరాధం అంటారు కదా.. అలా తానే వెళ్లి బంగారు నగలు ఉన్న పాత పేపర్లను పాత సామాన్ల అతనికి అమ్మేసింది. ఇంటికొచ్చాక పేపర్లలో బంగారం ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. కుయ్యో మొర్రో అంటూ ఆ పేపర్ కొన్నతని కోసం వీధులన్నీ గాలించింది. కానీ, అతను పత్తాలేకుండా పోయాడు. దీంతో సదరు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

తమిళనాడులోని రాశిపురం, విఘ్నేశ్ నగర్‌లో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కాలనీలో ఉంటున్న కళాదేవీ ఇంట్లో ఉన్న రూ.5 లక్షల విలువచేసే బంగారు నగలను (బంగారు గాజులు, మంగళసూత్రం, రెండు వజ్రపు చెవులు రింగులు) పాత పేపర్లలో భద్రపరిచింది. అయితే ఆ విషయాన్ని మరిచిపోయి పాత సామాను కొనే వి.సెల్వరాజ్ అనే వ్యక్తికి అమ్మేసింది. కొన్ని గంటల తర్వాత సోయికి వచ్చిన సదరు మహిళ బంగారం అతనికే ఇచ్చేశానని గ్రహించింది. గుండెలు బాదుకుంటూ అతనికోసం వీధులన్నీ జల్లెడపట్టింది. కానీ, అతను ఎక్కడా కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే సెల్వరాజ్‌ను పట్టుకున్నారు. అతని వద్దనున్న బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత తన బంగారం తిరిగి అప్పగించినందకు కళాదేవి మిక్కిలి సంతోషానికి గురైంది. ఆ ఆనందంలో ఆ వ్యక్తికి రూ.10వేల నగదును బహుమానంగా ఇచ్చింది.