దంపతులు అన్నాక కొన్ని విషయాల్లో బేధాభిప్రాయాలు రావడం సహజం. అయితే కొన్ని సార్లు ఈ బేధాభిప్రాయాలు ఒకరిపై ఒకరు దాడికి దారి తీస్తాయి. కొందరు బహిరంగ ప్రదేశాల్లో కూడా దాడి చేసుకుంటూ ఉంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బ్రిటన్లో మాంచెస్టర్ నుంచి టెనెరిఫీకి వెళ్లే విమానంలో జరిగింది. మాస్కు పెట్టుకోకుండా అరాచకం చేస్తున్న భర్తను ఓ భార్య అందరి ముందూ కొట్టింది. సెస్టెంబర్ 6న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో విమానం టేకాఫ్ అయిన తరువాత ఓ వ్యక్తి తన లొల్లి ప్రారంభించాడు. అందరూ మాస్కులు తొలగించాలని, కరోనాను చూసి భయపడొద్దంటూ అరవడం మొదలు పెట్టాడు. తోటి ప్రయాణికుల మాస్కులు తీసేసె ప్రయత్నం చేశాడు. విమానం సిబ్బంది వారించినా వినలేదు. దీంతో ఆయన భార్య రంగంలోకి దిగి అతన్ని తిట్టింది. అయినా కూడా అతను వినలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులందరూ చూస్తుండగానే అతని చెంపలు చెళ్లుమనిపించింది. విమాన ప్రయాణికుల్లో ఓ వ్యక్తిఈ తతంగాన్ని ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.