అధికారులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. దేశంలో ఏదో ఓ చోట మాదక ద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. దొరికితే రాజు దొరక్కపోతే దొర అన్నట్టు వ్యవహరిస్తున్నారు స్మగ్లర్లు. తాజాగా ముంబాయిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జింబాబ్వే ప్రయాణికురాలి నుంచి రూ. 84 కోట్ల విలువ చేసే 12 కేజీల హెరాయిన్‌ను డీఆర్ఐ(DRI) అధికారులు గుర్తించారు.
భారీగా డ్రగ్స్ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో ముంబాయి ఎయిర్ పోర్టులో ముందుగా డీఆర్ఐ అధికారులు మాటు వేశారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించినా జింబాబ్వే ప్రయాణికురాలిని విచారించి ఆమె దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నిర్ధారించారు. మొదట నోరుమెదపని నిందితురాలు..తర్వాత తమదైన శైలిలో అధికారులు విచారణ చేపట్టడంతో అసలు విషయం చెప్పేసింది.
కోట్ల విలువచేసే హెరాయిన్‌ను తరలించేందుకు ఆమె పెద్ద ప్లానే వేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ కవర్స్ లో హెరాయిన్ ప్యాకింగ్ చేసి ఫైల్ ఫోల్డర్ మద్య లో దాచి తరలించే ప్రయత్నం చేసింది. అయితే నిఘా అధికారుల కళ్లనుంచి ఆమె తప్పించుకోలేకపోయింది. నిందితురాలిపై ఎన్డీఆర్పీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.