ఆకలి పోరాటం.. బిడ్డను ఎత్తుకుని ఎండలో 13 కి.మీ. నడిచింది..
కంటికి కనిపించని కరోనా వైరస్ కంటే పేదవాడికి ఆకలితో పోరాటం చేయడమే గగనంగా మారింది. పూట గడవటం కోసం ఎన్నో తిప్పలు పడాల్సి వస్తోంది. ఓ వైపు ఉపాధి లేక.. సొంత ఊరికి వెళ్లలేక ఎంతో మంది వలస కూలీలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డాలో ఓ మహిళ తీరని వేదనను అనుభవించింది. తన 6 నెలల బిడ్డను చంకలో వేసుకొని మండుటెండలో బియ్యం కోసం ఏకంగా 13 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది.
బనియాపుకుర్ గ్రామానికి చెందిన మార్గరెట్ హన్స్‌దా భర్త బెంగుళూరులో కూలీ పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా పనిలేక డబ్బుల పంపలేదు. ఇంటికి వచ్చే అవకాశం కూడా లేదు. ఒంటరిగా ఉన్న భార్య తన మూడున్నరేళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు, మరో 6 నెలల బిడ్డకు భోజనం పెట్టలేక ఇబ్బంది పడింది. రేషన్ ఇస్తున్నారనే విషయం తెలియడంతో శిశువును చంకలో వేసుకొని నడుచుకుంటూ వెళ్లింది. కనీసం రేషన్ కార్డు కూడా లేని ఆమె ధీన స్థితిని చూసి అధికారులు చలించి పోయారు. వెంటనే సంబంధిత అధికారి హర్ధన్ దేవ్ ఆమెకు రేషన్ కిట్ అందించారు.తన బిడ్డల కడుపు నింపడం కోసం తాను ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని ఆ మహిళ ఆవేదన చెందిన తీరు స్థానికులను కలిచివేసింది. లాక్‌డౌన్‌లో బిడ్డల కోసం ఆ తల్లి పడిన ఆరాటం వింటేనే బాధగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.