woman was driven mad by her husband and son for property in Hanamkonda
mictv telugu

మతిస్థిమితం లేని మహిళపై డబ్బు పిశాచాల ఘోరం.. హనుమకొండలో..

August 11, 2022

ఆస్తిపాస్తుల కోసం ఓ మహిళను ఆమె భర్త, కొడుకు వేధించి మతిస్థిమితం కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఆమెను రైలెక్కించి, మరణించినట్లు నమ్మబలికి, తప్పుడు ద్రువపత్రాలను సృష్టించారు. ఆమె పేరు మీదున్న రూ.15 కోట్ల ఆస్తులను తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. ఆ డబ్బుతో తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకొని, విదేశాలకెళ్లగా.. కొడుకు బెంగుళూరులో జల్సాలు, సరదాలు చేస్తున్నాడు. మతిస్థిమితంలేని ఆ తల్లిని మాత్రం ఓ స్వచ్ఛంద సంస్థవారు చేరదీశారు. అనుకోకుండా ఆధార్ కార్డ్ కోసం ఆమెను ఫొటోలు తీయడం, ఆ తర్వాత అసలు విషయం బయటపడటం ఇవన్నీ జరిగిపోయాయి. అన్ని తెలిసిన తర్వాత కూడా అసలామె ఎవరో కూడా తెలియదని చెప్పాడు ఆ కొడుకు. సినిమా కథను తలపించేలా ఉన్న ఈ అమానవీయ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకెళ్తే.. హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన మతి స్థిమితంలేని 46 యేళ్ల మహిళకు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. కాగా ఆమెకు పెళ్లి సమయంలో తల్లి తండ్రులు కట్నకానుకల కింద కొన్ని ఆస్తులు ఇచ్చారు. ఆ ఆస్తి కోసం.. భర్త మరో మహిళను వివాహం చేసుకుని ఈమెను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆస్తిని తన పేరిట మార్చాలని ఆమెను వేధింపులకు గురి చేశాడు. తనకూ ఆస్తిలో భాగం వస్తుందని కొడుకు తండ్రితో చేరిపోయాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో తండ్రీకొడుకులిద్దరూ చిత్రహింసలు పెట్టారు. కొన్నిరోజుల్లోనే ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆమె చనిపోతే ఆస్తి తమ సొంతమవుతుందని, 2017లో ఓరోజు ఇద్దరూ దగ్గరుండి ఆమెను రైలెక్కించి ఎక్కడికో పంపించి వేశారు. ఆ తర్వాత ఆమె ఎక్కడో తప్పిపోయిందని, చివరకు చనిపోయిందని బంధువులను నమ్మించారు.

ఈ క్రమంలో భర్త మరో మహిళతో విదేశాలకెళ్లగా, కొడుకు బెంగుళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. మొత్తానికి ఇద్దరూ ఆమెను మరిచిపోయి ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు. ఇక 2017లో రైలెక్కిన ఆమె చెన్నైకి చేరుకోగా అక్కడి రైల్వే పోలీసుల సాయంతో ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. పాత జ్ఞాపకాలు పూర్తిగా మరచిపోయిన ఆమె.. అక్కడ కొంతవరకూ మానసికంగా కుదుటపడింది. ఆ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమెకు ఆధార్ కార్డు తీయాలని చెన్నైలోని ఓ ఆధార్ కేంద్రానికి తీసుకువెళ్లింది. అక్కడ వేలిముద్రలు తీస్తుండగా.. అప్పటికే ఆమెకు జిల్లాకు చెందిన మహిళగా కార్డు ఉందని సాఫ్ట్‌వేర్ గుర్తించింది. అందులో ఉన్న అడ్రస్ ప్రకారం.. స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు ఎంక్వయిరీ చేశారు. కుటుంబసభ్యులు అందుబాటులోకి రాకపోవడంతో హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఆమె ఫోటోతో మహిళ కుమారుడు వద్దకు వెళ్లారు. ఆమె ఫొటో చూపించగా.. ఖంగుతిన్న కొడుకు.. ముందు కాదు అని చెప్పాడు. తర్వాత తన తల్లి ఎప్పుడో చనిపోయిందంటూ.. మరణ ధ్రువీకరణ పత్రం తన వద్ద ఉందని బుకాయించాడు. దీంతో లోతుగా విచారిస్తే వారి కుట్ర బయట పడింది. ప్రస్తుతం పోలీసులు అసలు ఆ డెత్ సర్టిఫికెట్ ఎలా జారీ అయ్యిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. సదరు మహిళకు న్యాయం చేకూర్చడానికి ప్రయత్నిస్తున్నారు.