ఈ భార్య నాకొద్దు.. విడాకులు కావాలని 9 వ భర్త డిమాండ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ భార్య నాకొద్దు.. విడాకులు కావాలని 9 వ భర్త డిమాండ్

June 22, 2022

మహబూబాబాద్‌లో ఓ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న ఆ మహిళ నుంచి తనకు విడాకులు కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఆమె తొమ్మిదవ భర్త. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మహిళకు.. ఏపీలోని కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన వ్యక్తితో మ్యాట్రిమోని వెబ్‌సైట్లో పరిచయమైంది. ఆ పరిచయం పెళ్లికి దారి తీసింది. మూడేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. బెంగళూరులో కాపురం పెట్టిన తర్వాత కొన్ని నెలల పాటు మాత్రమే వీరు కలిసి ఉన్నారు. అయితే మహిళ తరచూ ఫోన్లో కోర్టు విషయాల గురించి మాట్లాడుతూ ఉండేదని ఆమె భర్త చెప్పాడు. ఏంటని అతను ప్రశ్నిస్తే గొడవకు దిగేదని తెలిపాడు. ఈ క్రమంలో ఆమె అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లిందని.. తిరిగి వెళ్లి వచ్చాక మరోసారి హైదరాబాద్ వెళ్తానని అనడంతో అనుమానంతో ఆరా తీసినట్టుగా మహిళ భర్త చెబుతున్నాడు.

ఈ క్రమంలోనే ఆమె తన కంటే ముందు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నట్టుగా అతడు గుర్తించాడు. ఆమెతో కలిసి జీవించలేనని భావించి విడాకులు కోరారని తెలిపాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ.. భర్త నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తే నిత్య పెళ్లికొడుకు అని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త.. అతడు సేకరించిన ఆధారాలను పోలీసుల ముందు ఉంచాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరి ఫిర్యాదులపై విచారణ చేపట్టారు.