100కు ఫోన్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

100కు ఫోన్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే.. 

November 29, 2019

దారుణ హత్యకు గురైన ప్రియాంక రెడ్డి తన చెల్లెలికి ఫోన్ చేసేబదులు డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదని సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. మహిళలకు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లను పోస్ట్ చేస్తున్నారు. డయల్ 100పై పోలీసులు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. హోంమంత్రి మహమూద్ అలీ కూడా అదే మాట అన్నారు. ప్రియాంక పోలీసులకు ఫోన్ చేసుంటే ఈ అఘాయిత్యం జరిగేది కాదని. ఆపదలో ఉన్నప్పుడు ఏ చిన్న సాయం కావాల్సి వచ్చినా డయల్ 100కు ఫోన్ చేయాలని డీజీపీ సైతం సూచించారు. 

ఈ నేపథ్యంలో ఓ యువతి డయల్ 100ను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు స్పందించి ఆమెకు సాయం చేసి తమ నిబద్ధతను చాటుకున్నారు. స్కూటీలో పెట్రోల్ అయిపోవడంతో ఇబ్బంది పడుతున్న సదరు యువతి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఎల్‌బీ నగర్ పోలీసులు.. పెట్రోలును ఓ బాటిల్‌లో తీసుకెళ్లి స్కూటీలో పోశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను రాచకొండ పోలీసులు ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘ప్రియాంక కూడా ఇలా ఒక్క కాల్ చేసినా బతికేది. అమ్మాయిలు అందరూ ఇక నుంచి ఈ యువతిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. పోలీసులకు సమాచారం అందిస్తే భద్రత తప్పకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి’ అని అంటున్నారు.