మద్యం షాపులో పనిచేస్తా, మద్యం మానిపిస్తా..
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం విధానంలో తాను భాగస్వామిని అవుతానంటూ ఓ మహిళ ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపుల్లో సూపర్‌వైజర్‌గా పనిచేసేందుకు అనంతపురం జిల్లా వెంకటపల్లికి చెందిన స్వప్న అనే మహిళ దరఖాస్తు చేసుకుంది. తన రెండేళ్ల కుమారుడితో కలిసి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైంది. ఆమెను చూసిన వారంతా మహిళ వైన్ షాపులో ఎలా ఉద్యోగం చేస్తుందని ప్రశ్నించారు. వారి పశ్నకు గట్టిగానే ఆమె సమాధానం చెప్పింది.
తన భర్త మల్లికార్జునరెడ్డి సహకారం వల్లే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పింది. ప్రభుత్వం తెచ్చిన మద్య నిషేధంలో భాగస్వామిని అవుతానని.. సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ మద్యం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తానని సమాధానమిచ్చింది. స్వచ్ఛమైన మనసుండాలే కానీ.. ఏ ఉద్యోగమైతే ఏంటి? సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానంటూ వివరణ ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల్లో పనిచేసేందుకు సూపర్‌వైజర్స్,సేల్స్‌మెన్ ఉద్యోగాలకు అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నారు.