చంద్రబాబు చచ్చినట్టు నా ముందుకు రావాల్సిందే : వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు చచ్చినట్టు నా ముందుకు రావాల్సిందే : వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు

April 23, 2022

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ముఖ్య నేత బోండా ఉమలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యలో కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ శనివారం అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి నోటీసులకు గల కారణాలను మీడియాకు వివరించారు. ‘చంద్రబాబు, బోండా ఉమలకు ఎందుకు సమన్లు జారీ చేశామో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అత్యాచార బాధితురాలికి న్యాయం చేద్దామని నేను వెళ్లా. అదే సమయంలో చంద్రబాబు, ఉమలు అక్కడికి వచ్చారు. చంద్రబాబు నాకు వేలు చూపించి బెదిరించారు. కళ్లు పెద్దవి చేసి నామీద ఆగ్రహం ప్రదర్శించారు. బోండా ఉమ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.

అత్యాచార బాధితురాలి ముందు ఇలా ప్రవర్తించడం ఏంటి? చంద్రబాబు 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకుంటారు. బాధితురాలిని ఎలా పరామర్శించాలో తెలియదా? అదేమైనా బహిరంగ సభ అనుకున్నారా? మహిళా కమిషన్ చైర్మన్ అని లెక్కచేయకుండా మాట్లాడితే రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉంటుంది? మహిళల జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపించడానికే సమన్లు పంపాం. కమిషన్ అంటే చంద్రబాబుకు గౌరవం లేదు. కమిషన్ అంటే ఓ డమ్మీ అని చూపించే యత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు సమన్లు ఇవ్వకపోతే రేపు ప్రతి మగవాడికి కొమ్ములు వస్తాయి. ప్రతీ పురుషుడు మమ్మల్ని చులకనగా చూస్తాడు. సమన్లు పంపితే విచారణకు రానని చెప్పేస్తాడు. సమన్లు ఇచ్చే అధికారం ఉంది కాబట్టే చంద్రబాబుకు పంపాం. కమిషన్ సమన్లు ఇచ్చిందంటే చచ్చినట్టు తమ ముందు హాజరుకావాల్సిందే. ఈ సంకేతం ప్రజల్లోకి వెళ్లడానికే నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించాం’ అని తెలిపారు. యువతిపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులను 24 గంటల్లో అరెస్టు చేసి వారం రోజుల్లో ఛార్జిసీటు దాఖలు చేసేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.