పోలీసులకు ఉసిరికాయలు అందించిన మహిళా పారిశ్రామికవేత్తలు - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులకు ఉసిరికాయలు అందించిన మహిళా పారిశ్రామికవేత్తలు

June 2, 2020

bfgcbv

కరోనా వైరస్‌‌ను జయించాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ‘సి’ విటమిన్ లభించే నిమ్మకాయలు, బత్తాయిలు, ఉసిరికాయలు వంటి పుల్లని పళ్లు తినాలని చెబుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణలో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు, పోలీసులు ఉన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం అన్నది నిజం. ప్రజలను ఎప్పటికప్పుడు రోడ్లమీద గుంపులుగా తిరగనివ్వకుండా పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రి పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరికొన్నిచోట్ల పోలీసులు, వైద్యులు కరోనాతో మృతిచెందుతున్నారు.

మండుతున్న ఎండల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల ఆరోగ్యం బాగుండాలని మహిళా పారిశ్రామికవేత్తలు ఆకాంక్షించారు. అంతేగాకుండా వారిలో రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడే ఉసిరికాయలు పోలీసులకు అందించారు. మంగళవారం సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిసి 3 టన్నుల ఉసిరి కాయలను అందజేశారు. వీ హబ్‌కు చెందిన మహిళ పారిశ్రామికవేత్తలు కీర్తీ ప్రియ, దీప్తీ రావుల, శకుంతలతో పాటు అదనపు డీసీపీ లావణ్య, సైబరాబాద్‌ కార్‌ హెడ్‌క్వార్టర్స్‌ అదనపు డీసీపీ మాణిక్‌రాజ్‌ తదితరులు సజ్జనార్‌ను కలిసి ఉసిరికాయలు అందించారు. ఈ సందర్భంగా మీరు ఆరోగ్యంగా ఉంటేనే మేము ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు.